రివ్యూ : రత్నం
తారాగణం : విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, యోగిబాబు, మురళీ శర్మ తదితరులు..
ఎడిటర్ : టిఎస్ జే
సినిమాటోగ్రఫీ : ఎమ్ సుకుమార్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాతలు : కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్
దర్శకత్వం : హరి
మాస్ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే కంప్లీట్ యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమానే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కోలీవుడ్ లో దర్శకుడు హరికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలన్నీ ఓ రేంజ్ స్పీడ్ తో కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా ఆ వేగం మరో దర్శకుడికి అందదు. అదే అతని స్పెషాలిటీ. కథ ఎలా ఉన్నా.. కథనం పరుగులు పెడుతుంది. హరి కెరీర్ ఆరంభం నుంచీ తీసిన సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. ఇక విశాల్ గతంలో భరణి, పూజ అనే సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన హరి ఈ సారి హ్యాట్రిక్ మూవీగా రత్నంతో వచ్చారు. విశాల్ కొన్నాళ్లుగా సరైన హిల్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ హిట్ కాంబో హ్యాట్రిక్ కొడుతుందనుకున్నారు. మరి ఈ శుక్రవారం విడుదలైన రత్నం సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
రత్నం(విశాల్) అనాథ. చిన్నతనం నుంచి లోకల్ రౌడీ(సముద్రకని) వద్ద పెరుగుతాడు. రత్నం మామా అని పిలిచే ఆ రౌడీ ఎమ్మెల్యే అవుతాడు. అతని కోసం రత్నం ఏమైనా చేస్తాడు. కానీ వీళ్లు అరాచకాలు చేయరు, అవినీతిని సహించరు. కేవలం మామ కోసమే బ్రతుకున్నుట్టుగా ఉన్న రత్నం లైఫ్ లోకి మల్లిక(ప్రియాభవాని) అనే అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే రత్నం తనను తాను మర్చిపోతాడు. నీట్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు వచ్చిన తనపై కొందరు రౌడీలు అటాక్ చేస్తారు. వారి నుంచి ఆమెను కాపాడిన రత్నం.. మల్లికకు ప్రాణాపాయం ఉందని తెలుసుకుని తనను కాపాడేందుకు ఆమె ఊరు వెళతాడు. ఆ క్రమంలో లింగం బ్రదర్స్ మల్లికను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుసుకుంటాడు. మరి ఈ లింగం బ్రదర్స్ ఎవరు..? మల్లికకు, రత్నంకు ఉన్న సంబంధం ఏంటీ..? లింగం బ్రదర్స్ మల్లికను ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మిగతా కథ.
ఎలా ఉంది..
మాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన రత్నం వీరి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి ప్రతి 20 నిమిషాలకు ఓ భారీ ఫైట్ లేదా ఛేజ్ అన్నట్టుగా పూర్తిగా హరి మార్క్ లోనే సాగుతుంది. కథా పరంగా చూస్తే ఇది రెగ్యులర్ హీరో, హీరోయిన్ ట్రాక్ లేని సినిమా. హీరో, హీరోయిన్ కు మధ్య ఉన్న రిలేషన్ కొత్తగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథను అల్లుకోవడం సాహసమనే చెప్పాలి. చూడ్డానికి మదర్ సెంటిమెంట్ లా కనిపించినా.. ఆ స్థాయిలో ఎమోషన్ పండలేదు. బట్ ఈ తరహా మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇప్పటి వరకూ రాలేదు అనే చెప్పాలి. కథాపరంగా ఇదో కొత్త పాయింట్ కూడా. ఇలాంటి పాయింట్స్ ను ఆడియన్స్ ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించకుండా ధైర్యంగా స్టెప్ వేసిన హరిని మెచ్చుకోవాలి. కాకపోతే విశాల్ కు సెపరేట్ గా ఇంకేదైనా హీరోయిన్ ట్రాక్ పెట్టి ఉంటే ఇంకా బావుండేదేమో. లింగం బ్రదర్స్ కు సంబంధించి టైటిల్స్ పడుతున్నప్పుడే వచ్చే ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ తరహా దారుణాలు ఆ కాలంలో నిజంగానే జరిగి ఉంటాయి అనేలా ఉందా ఎపిసోడ్. దానికి క్లైమాక్స్ కు ముడిపెట్టడం ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా ఉంది.
రత్నంగా విశాల్ పూర్తి అగ్రెసివ్ గా కనిపించాడు. ఇలాంటి పాత్రలు అతనికి చాలా ఈజీ. సింపుల్ గా చేసుకుంటూ పోయాడు. ఫీమేల్ లీడ్ చేసిన ప్రియా భవానికి మంచి పాత్ర దక్కింది.తనూ బాగా నటించింది. సముద్రఖనిది రొటీన్ రోల్. మురళీ శర్మ రొటీన్ గా అనిపించినా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా మాస్,యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ గా దేవీ శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం పరుగులు పెడుతుంది. పాటలు బాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. తెలుగు డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. డైరెక్టర్ గా హరికి తమిళ్ లో ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్టుగానే వచ్చిన రత్నం తమిళనాట కమర్షియల్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.
ఫైనల్ గా : రత్నం.. ఊరమాస్ ఎంటర్టైనర్
రేటింగ్ : 2.5/5