తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 6గంటల వరకు స్వామివారికి ఉంజల్ సేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ ఏపీ శ్రీనివాస దీక్షితులు సహా పలువురు పాల్గొన్నారు.
భక్తుల రద్దీ
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారికి 4.56 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 62,407 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 33,895 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.