Medaram Jatara : మేడారంలో 'తిరుగు వారం' పండుగ.. ఎప్పుడంటే

Medaram Jatara : మేడారంలో 'తిరుగు వారం' పండుగ.. ఎప్పుడంటే

By :  Kiran
Update: 2024-02-25 03:13 GMT


మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర(Sammakka Saralamma Jatara) ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరకు 1.40 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు చెబుతున్నారు. గతంలో నాలుగు రోజుల జాతరకు కోటి మంది భక్తులు వస్తే ఈ సారి కోటి 40 లక్షల మంది హాజరయ్యారని మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి ప్రకటించారు. శనివారం కూడా 20 లక్షల మందికి పైగా భక్తులు మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా ఆఫీసర్లు ప్రకటించారు.

మహాజాతర ముగియడంతో సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేశారు. తల్లుల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. ముందుగా కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె దించి.. తిరిగి చిలుకలగుట్ట వైపు వెళ్లిపోయారు పూజారులు. ఆ తర్వాత పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును, గోవిందరాజును‌‌‌‌‌‌‌ మరికొందరు పూజారులు తీసుకొని అడవి వైపు కదిలారు. చివరిగా సారలమ్మను తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. దేవతలను గద్దెకు చేర్చే క్రమంలో పోలీసులు ఏ విధమైన రక్షణ కల్పించారో అంతే కట్టుదిట్టమైన రక్షణ మధ్య దేవతలను వనానికి సాగనంపారు.

మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. మళ్లీ రెండేండ్ల తర్వాత మహాజాతర జరగనుంది. దీంతో మేడారం ప్రాంతం ఖాళీ అవుతున్నది. గత నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉన్న భక్తులు, వ్యాపారస్తులు ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు. షాపులన్నీ ఖాళీ చేసుకొని వెళ్లిపోతున్నారు. వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగ వరకు ప్రతీ రోజు ఎంతో కొంత మంది మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తారని దేవాదాయ శాఖ ఆఫీసర్లు, గిరిజన పూజారులు చెప్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈనెల 28న సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మేడారం గ్రామస్థులు, ఆదివాసీలు, పూజరుల కుటుంబీకులు ఇళ్లను శుద్ధి చేసి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, తిరిగి 2026లో ఈ మహా జాతర జరుగనుంది.


Tags:    

Similar News