ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. అటువంటి తెలంగాణ కుంభమేళా జాతర రేపటి నుంచి ఫిబ్రవరి 24వ తేది వరకూ జరగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క, సారలమ్మలకు భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మహా జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడమే కాకుండా కేంద్ర రైల్వేశాఖ కూడా స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది.
జాతరకు వచ్చిన భక్తులు తమ కోరికలు తీరినందుకు పెద్దఎత్తున బెల్లం మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే కొంత మంది కోళ్లు, మేకలు వంటివి అమ్మవార్లకు బలి ఇస్తూ ఉంటారు. వాటిని బలి ఇచ్చిన తర్వాత అక్కడే విందు ఆరగించి ఇక సొంత ఊర్లకు బయల్దేరుతారు. అయితే కొందరు మాత్రం బలిచ్చే కోళ్లు, మేకలను హలాల్ చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ ప్రధాన పూజారి అయిన సిద్ధబోయిన అరుణ్ కీలక విషయాన్ని వెల్లడించారు. మేడారం మహా జాతరలో ఎవ్వరూ హలాల్ చేయకూడదని, మేడారంలో హలాల్ అనేది నిషిద్ధం అని తెలిపారు.
మేడారం జాతరలో హలాల్ చేస్తే అమ్మవారికి మొక్కు చెల్లదు అని, గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు హలాల్ చేయడం విరుద్ధమని అన్నారు. ఆదివాసీ సంప్రదాయాల్లో హలాల్ చేయడం అనేది నిషేధం అని, అలాంటివారు ఎవరైనా ఉంటే దయచేసి మేడారం రావొద్దని, పూజారుల మనోభావాలను, ఆదివాసీ సంప్రదాయాలను దెబ్బతీయొద్దని పూజారి అరుణ్ సూచించారు. హలాల్ అంటే జంతువులను వధించిన తర్వాత వాటి నుంచి రక్తం పూర్తిగా బయటకు పంపిస్తారు. ఆ తర్వాతే తినడానికి వినియోగిస్తారు. అలా చేయడం మేడారంలో నిషిద్ధం అని ప్రధాన అరుణ్ తెలిపారు.