ఓరుగల్లు రాజధానిగా క్రీ.శ. 1083 నుండి క్రీ.శ.1323 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించాడు. ఆ సమయంలో మేడారం పగిడిద్దరాజు పాలనలో ఉంది. పగిడిద్ద రాజు భార్యే సమ్మక్క. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు ఉన్నాడు. ఆ రోజుల్లో కాకతీయ సామ్రాజ్యంలో తీవ్ర కరువు ఏర్పడింది. అయినా కప్పం కట్టాల్సిందేనని ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజును ఆజ్ఞాపించాడు. కుదరదని చెప్పడంతో
అపార్థం చేసుకున్న ప్రతాపరుద్రుడు పగడిద్దరాజు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడని భావించి ఆయనపైకి దండయాత్రకు పంపుతాడు. ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు మరణించడంతో భర్త మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధానికి వచ్చి తానూ కన్నుమూస్తుంది. ఆ తర్వాత సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు కూడా ప్రాణాలు కోల్పోతారు. అలా తమను నమ్మిన జనం కోసం వీర మరణం పొందిన గిరిజన వీరులే గిరిజన దేవతలుగా ఇప్పటికి పూజలు అందుకుంటున్నారు.
మేడారం జాతర రెండేండ్లకు ఓసారి జరుగుతుంది. ఈ జాతరకు దాదాపు 900 ఏండ్ల చరిత్ర ఉంది. 1940వ వరకు చిలుకల గుట్టపై మాత్రమే ఈ జాతర జరుపుకునేవారు. 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం మొదలుపెట్టారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేశారు. జాతర రోజు గద్దెలపైకి అమ్మవార్ల ప్రతిరూపాలుగా భావించే కుంకుమ భరిణలను తీసుకొస్తారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాక ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
జాతర మొదటిరోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవరోజున చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి పంపుతారు.
సమ్మక్క-సారలమ్మ జాతరను కోయతెగకు చెందిన గిరిజనులు నిర్వహిస్తారు. కోయ తెగలో 12 ఉప తెగలు ఉండగా.. వరంగల్ జిల్లాలోని రాచకోయ తెగకు చెందిన వారు మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. వీరే దీనికి హక్కుదారులు, పూజారులు. ఈ పూజారులను వడ్డెలు అని పిలుస్తారు.