రాత్రి 12గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ.. రేపు ఉదయమే..

Update: 2023-09-27 17:04 GMT

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 12గంటలకు గణనాథుడు చివరి పూజ అందుకోనున్నాడు. ఈ క్రమంలో గణపతి వద్ద భక్తుల దర్శనం నిలిపేశారు. ఇప్పటివరకు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మహా గణపతి నిమజ్జనం ఉంటుంది. ఉదయం 8గంటల లోను మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్కు చేరుకోనుంది. మధ్యాహ్నం 12గంటల లోపు పూజలు నిర్వహించి.. నిమజ్జనం పూర్తి చేస్తారు.

రేపు ఉదయం ప్రారంభమయ్యే గణపతి శోభయాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కూడా గురువారం ఉదయమే ప్రారంభం కానుంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ 5చోట్ల నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం 36 క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లు వేలాది మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

లంబోదరుడి శోభాయాత్ర , నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో బందోబస్తు కోసం రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసుల్ని నియమించారు. ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 25,694 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో 6వేల మంది సేవలు అందించనున్నారు. వీరితో పాటు 125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్‌ఏఎఫ్‌, పారా మిలిటరీ బలగాలను సిద్ధంగా ఉంచారు. గణేశుడి ఉరేగింపు, నిమజ్జనం కోసం 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతే వారిని రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. జలమండలి ఆధ్వర్యంలో 10లక్షల నీళ్ల ప్యాకెట్లను అందుబాటులో పెట్టారు.

Similar News