Janmashtami 2023: కృష్ణాష్టమి ఎప్పుడు? సెప్టెంబర్ 6నా? లేదా 7వ తేదీనా?
ఈఏడాది అదికమాసం రావడంతో ప్రతీ పండగ తేదీల్లో గందరగోళం నెలకొంటోంది. పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత నెలకొంది. తిథులు, పంచాగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండగ, శుభ ఘడియలు రెండు రోజులు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీ కృష్ణాస్టమిపై కూడా చాలామందిలో గందరగోళం నెలకొంది. ఒక్కో క్యాలెండర్ లో 6, 7వ తేదీలు ఉండగా.. అసలు ఏ తేదీన పండగ జరుపుకోవాలన్నది తేలట్లేదు. అయితే పంచాంగ కర్తలు సూచిస్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీనే జన్మాష్టమి వస్తుంది.
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు.. శ్రావణ మాసం బహుళాష్టమి అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3:27 గంటలకు అష్టమి తిథి ప్రారంభమై.. 7న సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం 6న ఉదయం 09:20 గంటలకు ప్రారంభమై.. 7న ఉదయం 10:25 గంటల వరకు కొనసాగుతుంది. అయితే నిషిత కాలంలో కృష్ణుని ఆరాధన కారణంగా పండుగను 6న జరుపుకుంటారు. 6వ తేదీన జన్మాష్టమి, 7వ తేదీన ఉట్టి కొట్టే వేడుకను నిర్వహించాల్సి ఉంటుంది. పూజకు అనుకూలమైన సమయం రాత్రి 11:57 గంటలకు మొదలవుతుంది.