అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు యాత్ర కొనసాగనుంది. ఈ ఏడాది 62 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు మంచులింగాన్ని దర్శనం చేసుకోనున్నారు. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ ఆలయంలో మంచు లింగం దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో 2023 అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది.
అమర్నాథ్ యాత్రలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జరిగే పూజలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలు, భద్రతను సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్, పహల్‌గామ్ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జూన్ 15 నాటికి దానిని తొలగించే పనిలో పడింది. మరోవైపు యాత్రకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల భద్రతతో పాటు మార్గమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
గత ఏడాది 3.45 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఈసారి ఆ సంఖ్య 6 లక్షలకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.