కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబైంది. సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శనివారం నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శని, ఆదివారాల్లో సర్వదర్శనాలను కూడా రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అదే రోజు రాత్రి శ్రీవారిని పెద్దశేషవాహన సేవ ఉంటుంది. 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. రాత్రికి వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. 3వ రోజు శ్రీవారు సింహవాహనంపై దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిస్తారు. 4వ రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.
5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో దర్శనమిస్తారు. రాత్రికి గరుడవాహనంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంత వాహనంపై మాడ విధుల్లో భక్తులకు దర్శనమిస్తాడు. అదే రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. ఈ పుష్పక విమానం మూడేండ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై శ్రీవారు ఊరేగుతారు. 7వ రోజున ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తారు. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు అనుగ్రహిస్తాడు. అనంతరం అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 9వ రోజు ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.