Medaram Jathara : మేడారంలో బెల్లం బంగారం ఎలా అయింది..?

By :  Kiran
Update: 2024-02-20 10:48 GMT

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన ఈ సమ్మక-సారలమ్మ జాతరగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకకు తెలంగాణ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. దేశంలో కుంభమేళా తర్వాత అంత భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ జాతర ఇదే కావడం విశేషం.

1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ గిరిజన జాతరకు తెలంగాణ, ఏపీతో పాటు ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి లక్షలాది మంది తరలివస్తారు. జాతర రోజునే కాకుండా అంతకు 15 రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారంకు చేరుకుంటారు. జాతర జరిగే నాలుగు రోజుల పాటు మేడారం జనసంద్రాన్ని తలపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుని తిరుగుపయనం అవుతారు.

మేడారం జాతరలో బెల్లమే ప్రసాదం. సమ్మక్క, సారలమ్మలకు భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దానినే బంగారం అని పిలుస్తారు. మొక్కిన మొక్కులు తీరితే నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించుకుంటారు. జాతర సమయంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టూ బంగారంతో నిండిపోతుంది. కాకతీయుల కాలం నుంచి సమ్మక్క, సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మేడారంలో బెల్లాన్ని బంగారంగా పిలవడం వెనుక చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. గతంలో వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఉప్పుకన్నా బెల్లం విలువ కాస్త ఎక్కువ. అందుకే దాన్ని ఖరీదైనదిగా భావించేవారట. వారికి అంత విలువైనదైనందుకే గిరిజనులు బెల్లాన్ని బంగారంగా భావించి సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. అయితే బెల్లాన్ని బంగారంగా పిలవడం వెనుక ఇంకో కథ కూడా ఉంది. పూర్వం భక్తులు చాలా దూరం నుంచి ప్రయాణించి మేడారం చేరుకునేవారు. అక్కడే ఓ వారం పది రోజులు పాటు ఉండి అమ్మవార్లను దర్శించుకునేవారు. వారంతా ఆకలైనప్పుడు ఇన్‌స్టంట్‌ ఎనర్జీ కోసం బెల్లం పానకాన్ని తాగేవారట. అలా శక్తినిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి కానుకగా సమర్పించేవారట.

చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరితే అమ్మలకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. సమ్మక్క, సారలమ్మను మొక్కుకున్న వారికి సంతానం కలిగినా, మంచి కాలేజీలో సీటు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, విదేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం వచ్చినా ఆ మొక్కులు మొక్కిన వారి బరువుకు సమానంగా బెల్లాన్ని అమ్మలకు ఇస్తారు.




Tags:    

Similar News