రేపే శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల విడుదల..ఇలా బుక్ చేసుకోవచ్చు
తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..ఆక్టోబర్ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను జూలై 19న విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు వీటిని బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టపళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి. అదే విధంగా జూలై 21న ఉదయం 10 గంటల నుంచి కల్యాణోత్సతవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. జులై 24న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ నెల అంగప్రదక్షిణం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
ఇలా బుక్ చేసుకోండి..
టీటీడీ టికెట్ల కోసం మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మనకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి అందులో ముందుగా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఇక ఓటీపీని ఎంటర్ చేస్తే… టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేయాలి. టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్లు పెరిగిపోవడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.