Jawan director atlee: జవాన్ డైరెక్టర్ అట్లీ గురించి తెలుసా? తీసిన ప్రతీ సినిమా హిట్టే
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ ను బద్దలు కొడుతూ అన్ని సినిమాల ఆల్ టైం రికార్డ్స్ ను కొల్లగొడుతుంది. పఠాన్ సూపర్ హిట్ సాధించిన అదే ఏడాదిలో జవాన్ తో.. బాలీవుడ్ లో తనకు తిరుగులేదని నిరూపించాడు కింగ్ ఖాన్. ఇక ఈ సినిమా హిట్ తో దేశ వ్యాప్తంగా అట్లీ పేరు మారుమోగుతుంది. అట్లీ గురించి తెలియని వాళ్లు నెట్ లో అతని గురించి తెగ వెతుకుతున్నారు. అట్లీ ఎవరు? ఏ సినిమాలు తీశాడు? డెబ్యూ డైరెక్టరా? అసలు ఎవరికీ తెలియని డైరెక్టర్ షారుఖ్ తో సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఎలా కొట్టాడంటూ అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అట్లీ కుమార్ అసలు పేరు అరుణ్ కుమార్. డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ముగపుతగమ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా పాపులర్ అయ్యాడు. తర్వాత 2013లో రాజారాణి సినిమా తీసి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అలా కోలీవుడ్ లో పెద్ద డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత విజయ్ తో హ్యాట్రిక్ సినిమాలు తీశాడు. 2016లో పోలీసోడు, 2017లో అదిరింది, 2019లో విజిల్ సినిమాలు తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి. కాగా, కోలీవుడ్ లో దుమ్ములేపిన అట్లీ.. ఒక్కసారిగా షారుఖ్ తో సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సౌత్ డైరెక్టర్లతో ఎక్కువగా పనిచేయని షారుఖ్.. అట్లీతో సినిమా ఒప్పుకునేసరికి అందరిలో ఆసక్తి మొదలయింది. అప్పటినుంచి అట్లీ ట్రాక్ రికార్డ్ ను తిరగేయడం మొదలుపెట్టారు. షారుఖ్ తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా ఒప్పుకున్నాడంటే పెద్ద కారణమే ఉండాలి? అదిరిపోయే కథ అయి ఉండాలి? అంటూ చర్చలు మొదలయ్యాయి. టీజర్, గ్లింప్స్ తో అందరి దృష్టిని మరోసారి ఆకర్షించాడు అట్లీ. సెప్టెంబర్ 7న జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి అంచనాలను అందుకున్నాడు. సూపర్ హిట్ కొట్టాడు. అంతేకాదు షారుక్‌ని పలు వైవిధ్య గెటప్స్ లో మరే డైరెక్టర్ చూపించలేదు. ఆ ఘనత అట్లీకి దక్కింది.