అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా.. Ali

Byline :  Veerendra Prasad
Update: 2024-02-19 08:45 GMT

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ స్పందించారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరుగలేదని, వైఎస్సార్‌సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈ వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే చాన్స్ ఉందని... జగన్ ఆదేశాల మేరకు అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారు. రాప్తాడు సభ చూశాక వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని అర్థమైపోయిందన్నారు అలీ.

రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అని అన్నారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజం అని చెప్పారు. కానీ, అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. కాగా, సినిమాల్లో మంచి పేరు సంపాదించిన అలీకి ప్రజాప్రతినిధి కావాలని గట్టి కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ పోటీ చేసే ఛాన్స్ రాలేదు. ఈ సారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు. ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్.. అలీ పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది

Tags:    

Similar News