మళ్లీ ప్రతినిధిగా వస్తున్న నారా రోహిత్.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో నారా రోహిత్. చివరిసారిగా ‘'వీరభోగ వసంతరాయలు'’ అనే చిత్రంలో నటించాడు. తాజాగా ఓ పొలిటికల్ టచ్ ఉన్న మూవీతో రాబోతున్నాడు. గతంలో నారా రోహిత్ చేసిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. దీనికి 'ప్రతినిధి 2' (Prathinidhi 2) అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్.
నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో నారా రోహిత్ ఒంటి నిండా వార్తాపత్రికలను చుట్టుకుని చేయి పైకెత్తి ఉంటాడు. తాజా లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘''అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మళ్లీ నిలబడతాడు''’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ క్యాప్షన్ కూడా రాశారు. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. వానరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా నాని చమిడిశెట్టి వ్యవహారిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయనున్నారు.
నారా రోహిత్ కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ప్రతినిధి ఒకటి. 2014లో రిలీజైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో హీరో రోహిత్ సీఎంను కిడ్నాప్ చేసి వ్యవస్థను మార్చాలనుకునే యువకుడిగా కనిపించాడు. ప్రతినిధి చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు.