డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయ్కాంత్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ మేరకు చెన్నై మయత్ హాస్పిటల్ సిబ్బంది హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం.. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని, ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ల ప్రకటనతో విజయ్కాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అనారోగ్య కారణాలతో విజయ్కాంత్ నవంబర్ 18న మయత్ హాస్పిటల్ లో చేరారు. దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయన.. దాదాపు 10 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. కొన్నాళ్లుగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్లు కనిపించింది. అయితే గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన రికవర్ అవుతారని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే విజయ్కాంత్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అటు డీఎండీకే శ్రేణులు మాత్రం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని,ఆయన ఒకట్రెండు రోజుల్లో కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని చెబుతున్నారు.