Actress Sowmya Janu : హోం గార్డుపై దాడి.. సినీ నటి కోసం పోలీసుల వెతుకులాట
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్య జాను అని పోలీసులు తేల్చారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సౌమ్య అందుబాటులో లేకపోవడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే సౌమ్యజాను మాత్రం హోంగార్డుదే తప్పు అని చెప్పడం గమనార్హం.
ఎమర్జెన్సీ పని ఉండడం వల్లే తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు సౌమ్య తెలిపారు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న హోంగార్డు తిట్టడంతో తాను కూడా గట్టిగానే రియాక్ట్ అయినట్లు చెప్పింది. హోంగార్డు లైఫ్ జాకెట్ తాను చించలేదని.. అతడిపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివరించింది. అంతేకాకుండా తనను పోలీసులు విచారణకు పిలవలేదని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ 12లో డ్యూటీలో ఉన్న హోంగార్డుతో సౌమ్య దురుసుగా ప్రవర్తించింది. రాంగ్ రూట్ వచ్చినందుకు ప్రశ్నిస్తే అతడిపై దాడికి పాల్పడింది. అతని జాకెట్ ను చింపి నానా హంగామా సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.