కొన్నాళ్ల క్రితం యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అనగానే పేరెంట్స్ పడి తినడం.. ఉద్యోగం సజ్జోగం లేకుండా గాలికి తిరుగుతూ ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం.. ఆ పిల్లతో పెళ్లి కోసం ఆ కుటుంబాన్ని ఎదురించడం.. చివరికి పెళ్లి చేసుకోవడం.. ఇదే కనిపించేది. ఇంతకంటే ఎక్కువగా ఆలోచించలేకపోయేది మన తెలుగు సినిమా మేకర్స్. దీన్నే చాలా గొప్పగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నారు. అయితే ఈ ట్రెండ్ కు ఆడియన్స్ చరమగీతం పాడారు. కంటెంట్ లేని సినిమాలకు కటీఫ్ చెప్పారు. ఇప్పుడు సరికొత్త కథలు వస్తున్నాయి. టెక్నికల్ గానూ బ్రిలియంట్ అనిపించుకుంటున్నాయి. ఈ తరుణంలో మళ్లీ ఆ పాత ట్రెండ్ లోనే కనిపిస్తు కొత్త సినిమా వస్తోంది. అదే వైష్ణవ్ తేజ్ 'ఆది కేశవ'.
ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చినా.. కొండపొలం, రంగరంగ వైభవంగా వంటి డిజాస్టర్స్ చూసి ఉన్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన తరుణంలో ఆదికేశవతో వస్తున్నాడు. ఈ నెల 24న విడుదల కాబోతోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డిదర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. లేటెస్ట్ హిట్ సైరెన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తే దర్శకుడు ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్లి కథ రాసుకున్నట్టుగా కనిపిస్తోంది. అదే రొటీన్ పేరెంట్స్ అండ్ హీరో. అతని ఫ్రెండ్ లోనూ మార్పు లేదు. ఇక హీరోయిన్ అయితే ఆ పాత టెంప్లేట్ తోనే కనిపిస్తోంది. ఇలాంటి జులాయి హీరోల కోసమే అలాంటి హీరోయిన్లు అన్నట్టుగా కనిపిస్తోన్న డైలాగ్స్. ఇవన్నీ ట్రైలర్ లోనే పరమ రొటీన్ గా కనిపిస్తున్నాయి. ఇక సడెన్ గా అరే.. మన సినిమాలో యాక్షన్ కూడా ఉంది కదా అన్నట్టుగా సగం ట్రైలర్ నుంచి ఫైట్స్ స్టార్ట్. సడెన్ గా విలన్ ఎంట్రీ. హీరో కోసమే ఎదురుచూస్తున్నట్టు బిల్డప్. ఆనక రక్తపాతం.. ఈయనకో ఫ్లాష్ బ్యాక్.. ఇదీ సెటప్.
ఈ సెటప్ కు కాలం చెల్లి చాలాకాలం అయింది. అయినా సితార వంటి బ్యానర్ ఈ పాత చింతకాయ పచ్చడికి ఓటు వేయడం ఆశ్చర్యమే. అయితే ట్రైలర్ లోని డైలాగ్స్ బావున్నాయి. కాకపోతే '' నా పెద్ద కొడుకు వైద్యం చేయాలంటే డాక్టర్ అనే పదవి అవసరం. అదే నా చిన్న కొడుకు న్యాయం చేయాలంటే ఎదుటోడికి సమస్య ఉంటే చాలు'' అంటూ సీనియర్ నటి రాధిక ఒక డైలాగ్ చెబుతుంది. కానీ ఇందులో డాక్టర్ అనేది పదవి కాదు అని.. అర్హత అని చిన్న సెన్స్ ఆ డైలాగ్ రాసిన వారికీ, దర్శకుడికీ, చివరికి ఎంతో తెలివైన మహిళగా చెప్పుకునే రాధికకూ లేకపోవడం విశేషం కాదు.. ఈ కథ ఎలా ఉండబోతోంది అనేందుకు ఓ ఉదాహరణగానూ అనుకోవచ్చు.
ఏదేమైనా ఆదికేశవ ట్రైలర్ చూస్తే కంప్లీట్ అవుట్ డేటెడ్ కంటెంట్ తో వస్తోన్న సినిమాలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ఫ్లాపులతో ఉన్న వైష్ణవ్ కు హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇవ్వడానికే ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఈ మధ్య ఈ తరహా పాత చింతకాయ కథలు కూడా అప్పుడప్పుడూ హిట్ అవుతున్నాయి. అలాంటి జాక్ పాట్ ఏదైనా ఈ మూవీకి తగిలితే చెప్పలేం కానీ.. ఆదికేశవ ట్రైలర్ మాత్రం చాలా నిరాశపరిచేలానే ఉందని చెప్పాలి.