తమిళ స్టార్ అజిత్కు ఆర్మీ కాంట్రాక్ట్.. 200 డ్రోన్లు..

Update: 2023-08-27 14:35 GMT

అజిత్.. తమిళ స్టార్ హీరో. తెల్లని జుట్టుతో ఎటువంటి హంగామా లేకుండా సింపుల్గా ఉంటాడు. అభిమాన సంఘాలను కూడా ఎంకరేజ్ చేయడు. తన పని తను చేసుకుంటూ పోతాడు. అంతేకాదు ఆయనో రేసర్, షూటర్. నేషనల్ కార్ రేసింగ్, షూటింగ్ కాంపిటేషన్ లోనూ పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు అవార్డులు సైతం గెలిచారు. ప్రస్తుతం ఆయన దేశ రక్షణ రంగానికి సంబంధించిన కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు.

విద్యార్థులకు క్లాసులు..

విమానాల పట్ల ఆసక్తి ఉన్న అజిత్.. వాటి గురించి ఎక్కువగా తెలుసుకునేవాడు. దీంతో ఏరో స్పేస్‌కు సంబంధించి కొన్ని కోర్సులు చేశాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. ఫైటర్‌జెట్‌ నడిపే ట్రైనింగ్‌ తీసుకుని పైలట్‌ లైసెన్స్‌ కూడా సాధించాడు. ఈ క్రమంలో మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ విద్యార్థులకు ఆయన క్లాసులు చెప్తాడు. దీంతో ఎమ్ఐటీ ఆయనను ‘‘హెలికాప్టర్‌ టెస్ట్‌ పైలట్‌ యూఏవీ సిస్టమ్‌ అడ్వైజర్‌గా’’ నియమించుకుంది.

అబ్దుల్‌ కలాం అవార్డు..

అజిత్కు దక్ష అనే ఓ సంస్థ ఉంది. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులతో కలిసి దానిని నడపుతున్నాడు. ఆ సంస్థకకు డ్రోన్ల తయారీలో మంచి పేరుంది. అజిత్‌ వారితో కలిసి డ్రోన్‌ ట్యాక్సీ, డ్రోన్‌ అంబులెన్స్‌ను తయారు చేశాడు. అధిక బరువును అతి తక్కువ సమయంలో టార్గెట్‌కు చేర్చేలా ఈ డ్రోన్‌లను తయారుచేశారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు బ్లడ్, మెడిసిన్ అందజేసిన ఆ డ్రోన్‌కు 2019లో భారత డ్రోన్‌ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ఇచ్చే అబ్దుల్‌ కలాం అవార్డును అజిత్‌కు అందజేసింది.

డ్రోన్లతో రసాయనాలు..

కోవిడ్‌ సమయంలో దక్ష సంస్థ రూపొందించిన డ్రోన్లు తమిళనాడులో ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పెట్రోల్‌తో నడిచే ఈ డ్రోన్ అరగంటలో ఎకరం విస్తీర్ణంలో రసాయనాలను చల్లుతుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కరోనా సమయంలో రసాయనాలు చల్లేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించింది. మనుషులతో పనిలేకుండా రోజుకు వెయ్యి లీటర్ల రసాయనాలు చల్లేవారు. తాజాగా ఈ సంస్థకు రక్షణశాఖ కీలక ప్రాజెక్ట్ అప్పజెప్పింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు గస్తీ కాసేందుకు డ్రోన్లు తయారు చేసే బాధ్యతలను ఇచ్చింది.

ఏడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసి ఇవ్వాలని దక్ష సంస్థతో రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ.170 కోట్లు. ఈ దక్ష టీమ్ రూపొందించిన డ్రోన్లను భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో నిఘాకోసం, విపత్తుల్లో సహాయక కార్యక్రమాల కోసం భారత రక్షణ శాఖ వినియోగించనుంది. అజిత్ రక్షణ శాఖకు డ్రోన్లు అందించే స్థాయికి ఎదగడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News