అల్లు అరవింద్- చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. తన బావకి ఎలాంటి కథ అయితే సరిగ్గా సరిపోతుందో అరవింద్ కు తెలిసినంతగా చిరంజీవికి కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అయితే 2005లో వచ్చిన అందరివాడు తర్వాత ఈ బావ బావమరిది కలయికలో మరో సినిమా రాలేదు. మెగాస్టార్ పాలిటిక్స్ లో ఫెయిల్ అయిన తర్వాత రీ ఎంట్రీ చిత్రాన్ని తనే నిర్మించాలనుకున్నాడు అరవింద్. కానీ ఆ ఛాన్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు. సైరా చేయాలనుకున్నా.. ఆ కథ వర్కవుట్ కాదని అరవింద్ ముందే గ్రహించాడు. అప్పటి నుంచి చిరంజీవితో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఇన్నాళ్లకు ఈ కాంబోలో సినిమా సెట్ అయినట్టే కనిపిస్తోంది. అది కూడా క్రేజీ డైరెక్టర్ తో.
ప్రస్తుతం చిరంజీవి.. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీకి సిద్ధం అవుతున్నాడు. దీంతో పాటు కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత.. ఖచ్చితంగా చెబితే.. వచ్చే యేడాది దసరా టైమ్ కు సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ప్లాన్ చేశాడు అరవింద్. నిజంగా సుకుమార్ - చిరంజీవి కాంబినేషన్ లో పదిహేనేళ్ల క్రితమే సినిమా రావాల్సి ఉంది. అప్పుడు చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు.
ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చి ఉన్నాడు. అతనితోనే పుష్ప2 చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేయబోయేది చిరంజీవినే అని టాలీవుడ్ నుంచి స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఈ మేరకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడం వెనక అరవింద్ మాస్టర్ స్కెచ్ ఉందంటున్నారు. ఇదే నిజమైతే.. ఈ క్లెవర్ డైరెక్టర్ చిరంజీవిని ఎలాంటి కథలో చూపిస్తాడా అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలవుతుంది.