బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన కూతురు ఐరా ఖాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఆరోగ్యం, కుటుంబం గురించి ఐరా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన తల్లిదండ్రులు విడాకులు తీసకున్నప్పుడు తాను మానసికంగా కుంగిపోయినట్లు ఐరా చెప్పింది.
‘‘అమ్మా-నాన్న విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను. విషయం తెలియగానే వెంటనే భారత్‌కు తిరిగి వచ్చాను. ఈ విషయం నన్ను మానసికంగా కుంగదీసింది. నాలుగు రోజులు అన్నం కూడా తినలేదు. రోజులో ఎనిమిది గంటలు ఏడ్చేదాన్ని.. 10 గంటలు నిద్రపోయేదాన్ని. ఏడాదిన్నరపాటు అలాగే గడిపాను’’ అని ఐరా చెప్పింది.
అంతేకాకుండా తన కుటుంబంలోనే కొంతమంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఐరా తెలిపింది. అందుకే తను చిన్న సమస్యను కూడా తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని వాపోయింది. డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా 8 -10 నెలలకు ఒకసారి మానసికంగా కుంగిపోతున్నట్లు వివరించింది. ‘‘గతేడాది జులైలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో మందులు తీసుకోవడం మానేశాను. విపరీతంగా బరువు పెరిగాను. కానీ డిప్రెషన్ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు అంతా బాగుంది’’ అని ఐరా చెప్పింది.
అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్ జన్మించింది. 16 ఏళ్ల తర్వాత 2002లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్‌రావును వివాహం చేసుకున్నారు. 15 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది. ప్రస్తుతం అమీర్ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే దంగల్ నటి ఫాతిమా సనాతో డేటింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.