తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' ఆరు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని త్వరలో 7వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు సీజన్ల నుంచి హోస్ట్‌గా ఆకట్టుకుంటున్న నాగార్జున మరోసారి తనదైన స్టైల్లో ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా 7వ సీజన్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు షో స్టార్ట్ కావడానికి ముందే నాగార్జునకు కోర్టు నోటీసులు అందినట్లు సమాచారం. దీంతో మరోసారి బిగ్‌బాస్ వివాదంలో చిక్కుకుంది.
టెలివిజన్‌లో ప్రసారం అవుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందంటూ గతంలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి రెండు పిటిషన్లను వేశారు. బుధవారం ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఎలాంటి సెన్సార్ లేకుండా షోను టెలికాస్ట్ చేస్తున్నారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఇలాంటి షోలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలలోపు మాత్రమే టెలికాస్ట్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి తన వాదనలను కోర్టుకు వినిపించారు.
ప్రతిగా ఎండోమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తరపున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. ప్రస్తుతం 'బిగ్‌బాస్ షో ప్రసారం కావడం లేదని, ఈ సమయంలో ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదన్నారు. రాబోయే సీజన్‌పై అభ్యంతరం ఉంటే మళ్లీ పిల్ వేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక మాటీవీ తరపున ఉన్న సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తన వాదనలను వినిపించారు. బిగ్‌బాస్ షో టెలికాస్ట్కు ముందు ఎలాంటి సెన్సార్‌షిప్ విధానం లేదన్నార. షో నచ్చకపోతే చానల్ చేంజ్ చేసుకోవచ్చునని సూచించారు.
ఇరు వాదనలు విన్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. బిగ్‌బాస్ రియాల్టీ షోకు సెన్సార్‌షిప్ అవసరమేనని తేల్చి చెప్పింది. షో టెలికాస్ట్ అయ్యాక కంప్లైంట్స్ పై చర్యలు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించింది. చానళ్లు అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నా పర్యవేక్షించకూడదా? అని ప్రశ్నించింది. నైతిక విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. షో ప్రసారానికి ముందే సెన్సార్ విషయంలో కేంద్రానికి సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామంది. పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర సర్కార్లతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, మాటీవీ, ఎన్‌డేమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో సహా అక్కినేని నాగార్జునకు నోటీసులు పంపించింది.