Rajadhani Files : సినిమా రగడ.. ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు!
రాజధాని ఫైల్స్ మూవీ విడుదలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే విధించింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కిందని, ఆ మూవీ విడుదలను ఆపాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ మూవీ విడుదలను ఆపాలంటూ హైకోర్టు ఆదేశించింది. అయితే రేపటి వరకూ మాత్రమే సినిమా విడుదల నిలిపివేయాలని తెలిపింది. మూవీకి సంబంధించి అన్ని రికార్డులను తమకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
నేడు రాజధాని ఫైల్స్ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు స్టేతో మూవీ విడుదల ఆగింది. ఈ మూవీలో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే సన్నివేషాలు ఉన్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. ప్రజల ముందు వైసీపీని చులకనగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాను రూపొందించారని పిటిషన్‌లో ఆరోపించారు.
కోర్టు విచారణలో రాజధాని ఫైల్స్ సినిమా నిర్మాతల తరపున న్యాయవాది ఉన్నం మురళీధరరావు తన వాదనలు వినిపించారు. రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేషాలను తొలగించినట్లు తెలిపారు. వివాదాస్పద సీన్లు తొలగించిన తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. డిసెంబర్ నెలలోనే తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందన్నారు. అన్నింటిని దాటుకుని ఈ సినిమా కచ్చితంగా విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.