నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ఈ నెల 19న విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. శ్రీ లీల.. బాలయ్య కూతురు పాత్రలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచింది. అయితే సెన్సార్ నుంచి సినిమాకు ఓ డిఫరెంట్ టాక్ వచ్చింది. ఆ టాక్ ప్రకారం చూస్తే ఈ మూవీ రివ్యూను కూడా ముందే అర్థం చేసుకోవచ్చు.
నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ)కి విజ్జి పాప(శ్రీ లీల)అంటే ప్రాణం. ఆమె అతన్ని చిచ్చా అని పిలుస్తుంది. విజ్జు పాపకు భగవంత్ తప్ప ఎవర ఉండరు. తన కన్న కూతురులా చూసుకునే విజ్జుపాపను ఎలాగైనా ఆర్మీకి పంపించాలనే ఆరాటపడుతుంటాడు. ఇది ఆమెకు నచ్చదు. అయినా తన ప్రయత్నం ఆపకుండా ఆమెను ట్రెయిన్ చేస్తుంటాడు భగవంత్. మరోవైపు రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) విజ్జు పాపను వెదుకమని కొందరు రౌడీలు పంపిస్తాడు. ఇటు ఒకానొక దశలో తననెందుకు ఆర్మీకి పంపించాలనుకుంటున్నాడనేది కాత్యాయని(కాజల్) ద్వారా అర్థం చేసుకున్న విజ్జి పాప సీరియస్ గా ఆ ప్రయత్నం ప్రారంభిస్తుంది. ఈ ప్రయత్నంలో భగవంత్ లేని టైమ్ లో కొందరు దుండగులు విజ్జిపాపను కిడ్నాప్ చేసి చంపాలనుకుంటారు. అది తెలిసి వెళ్లి ఆమెను కాపాడుకుంటాడు భగవంత్ కేసరి. అప్పుడే అతనికి ఓ పెద్ద విషయం తెలుస్తుంది. విజ్జి పాపను చంపే వ్యక్తి తన మాజీ శతృవు అని తెలుసుకుంటాడు. అతని వల్లే విజ్జీ తల్లితండ్రులు పోయారన్న విషయం తనకు మాత్రమే తెలుసు. అలాంటి విలన్ మళ్లీ ఈమెను ఎందుకు చంపాలనుకుంటున్నాడు..? విజ్జి, భగవంత్ మధ్య ఉన్న బంధం ఏంటీ..? ఆమె పేరెంట్స్ ఎవరు..? అసలు భగవంత్ కేసరి ఎవరు అనేది మిగతా కథ.
ఇదే భగవంత్ కేసరి కథ అంటూ సెన్సార్ నుంచి తెలుస్తున్న అంశం. అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాలయ్య, విజ్జి మధ్య వచ్చే సన్నివేశాలతో చాలా హృద్యంగా ఉంటుందట. మొదట్లోనే ఒక ఫైట్ ఉన్నా.. అది సింపుల్ గానే ఉంటుందట. కాజల్ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. కానీ రెగ్యులర్ హీరోయిన టైప్ లో కనిపించదట. ఇక అనిల్ రావిపూడి అన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతున్నట్టుగా ఇంటర్వెల్ ఫైట్ ఇప్పటి వరకూ వచ్చిన బాలయ్య సినిమాల కంటే హైలెట్ గా ఉంటుందట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. ఇక నేలకొండ భగవంత్ కేసరి అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది.
భగవంత్ ఓ ఆర్మీ ఆఫీసర్. అతని స్నేహితుడే శ్రీ లీల తండ్రి. ఇద్దరూ సేమ్ కేడర్ లో పనిచేస్తున్నప్పుడు తమతో పాటుగా ఉన్న రాహుల్ సంఘ్వీ శతృ దేశాలకు సహకరిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడన్న విషయం శ్రీ లీల తండ్రికి తెలుస్తుంది. ఇది భగవంత్ కు చెప్పాలనుకుంటుండగా.. రాహుల్ అతన్నే ఆ కేస్ లో ఇరికించి చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. అప్పటి నుంచి విజ్జిపాప బాధ్యత తను తీసుకుంటాడు భగవంత్ కేసరి. అయితే రాహుల్ కు సంబంధించిన సీక్రెట్ కు శ్రీ లీలకూ ఓ లింక్ ఉంటుంది. అది ఎప్పటికైనా తనకు ప్రమాదం అని తెలిసే.. అతను ఆమెను చంపాలనుకుంటాడు. విషయం తెలిసిన తర్వాత భగవంత్ తన స్నేహితుడు దేశ ద్రోహి కాదని నిరూపిస్తూ.. రాహుల్ దోషిగా నిలబెట్టి.. తన కూతురు కూడా ఆర్మీలో పనిచేయాలన్న తన స్నేహితుడి కోరికను ఎలా నెరవేర్చాడు అనేదే భగవంత్ కేసరి సినిమా.
మొత్తంగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూస్తారట. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయని టాక్. ఇక బలవంతుడైన విలన్ ను ఎదుర్కొనేందుకు తన పాత మిత్రులు చేసే సాయం .. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కేసీపీడీ అనేలా ఉంటుందట. మొత్తంగా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులూ ఉంటూనే.. బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడట అనిల్ రావిపూడి.
ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా డల్ మూమెంట్స్ ఉన్నా.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథనం వేగంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలయ్యే రివెంజ్ డ్రామా అన్నీ చకచకా సాగుతూ వెళుతుందట. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు చాలా వరకూ బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువగా నచ్చేవి.. కానీ ఇది ఇతర ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
ఇక థమన్ నేపథ్య సంగీతం మరీ గొప్పగా లేకపోయినా అవసరం అయిన చోట మాత్రం అదరగొట్టాడని టాక్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీన్స్ లో అదుర్స్ అంటున్నారు. పాటలు బానే ఉన్నాయి. అనిల్ రావిపూడి డైలాగ్స్ ఈ సారి ఫన్ తో పాటు ఫైర్ కనిపించింది. అతని డైలాగ్స్ బాలయ్య డిక్షన్ బాగా వచ్చాయి. మొత్తంగా ఈ దసరాకు పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా భగవంత్ కేసరి శానాకాలం కాకపోయినా కొంతకాలం పాటు యాది ఉంటుందని చెప్పొచ్చంటున్నారు.