RGVపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

Byline :  Veerendra Prasad
Update: 2023-12-29 05:10 GMT

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు గత రాత్రి ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్‌ అయిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ చేసిన కామెంట్స్‌ను బర్రెలక్క సీరియస్ గా తీసుకున్నారు. వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయిపోయింది’.. అని ఆర్జీవీ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. ‘నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు. అంతే కానీ మా ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడటం తప్పు అని లాయర్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని’  స్పష్టం చేశారు. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, సినిమాను ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.

కాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బర్రెలక్కకు భారీగానే మద్దతు పెరిగింది. నిరుద్యోగుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఎన్నికల ఫలితాల్లో బర్రెలక్కకు ఏకంగా 5,754 ఓట్లు పోలయినట్లు ఈసీ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నారైలు, మాజీ ఐపీఎస్‌లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికారు.

Tags:    

Similar News