బస్​స్టాప్ చోరీ కేసులో ట్విస్ట్​.. కంప్లైంట్ చేసిన వారిపై కేసు.!!

Byline :  Veerendra Prasad
Update: 2023-10-11 07:26 GMT

కర్ణాటక బెంగళూరు నగరంలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న బస్ స్టాప్ చోరీకి గురైన విషయం తెలిసిందే. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన( Bengaluru bus shelter )బస్టాప్ చోరీ కేసు సోమవారం అనూహ్య మలుపు తిరిగింది. అసలు ఆ బస్టాప్ చోరీ కాలేదని.. నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల అధికారులే అక్కడి నుంచి తొలగించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మరోవైపు, కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై అధికారులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.




 


నగరంలోని కన్నింగ్​హామ్ రోడ్​లో బస్​స్టాప్ నిర్మాణానికి సైన్​బోర్డ్ అనే కంపెనీకి బృహత్ ​బెంగళూరు మహానగర పాలకె(బీబీఎంపీ) అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21న రూ.10లక్షల విలువైన బస్​స్టాప్​ను సైన్​బోర్డ్ ఏర్పాటు చేసింది. ఆరు రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 ఈ బస్​స్టాప్​ను పరిశీలించేందుకు సైన్‌బోర్డు సంస్థ ప్రతినిధులు వెళ్లారు. కానీ, అక్కడ వారికి బస్టాప్ కనిపించకపోయేసరికి ఖంగుతిన్నారు. వెంటనే బీబీఎంపీ అధికారులను సంప్రదించగా.. తమకేమీ తెలియదని బదులిచ్చారు. దీంతో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రవి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా..సెప్టెంబర్‌ 30న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.




 


నాణ్యత లేకుండా నిర్మించారంటూ ఫిర్యాదు రావడం వల్ల స్థానిక శివాజీనగర్​ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) బస్​స్టాప్​ను పరిశీలించారు. నాణ్యత లేకుండా ఉండడం వల్ల బస్​స్టాప్​ను అక్కడి నుంచి గోడౌన్​కు తరలించినట్లు తేలింది. ఈ విషయం తెలియని నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నాణ్యత లేకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు అధికారులు. దీనిపై వసంతనగర్ సబ్-డివిజన్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘మిస్టరీ వీడింది. ఇది దొంగతనం లేదా ఎత్తుకెళ్లడం కాదు.. నాసిరకం పని కారణంగా బీబీఎంపీ దాన్ని తొలగించింది.. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాకు తప్పుదోవ పట్టించే ఫిర్యాదు ఇచ్చారు.. నాణ్యతలోపంపై వివరణ కోరుతూ నోటీసు ఇచ్చాం’ అని తెలిపారు.



 


Tags:    

Similar News