భారత్పై చైనా కుట్రలు, దాడులపై వస్తున్న చిత్రం భారతీయన్స్. ఈ మూవీని ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా సినిమాల రచయిత దీన్ రాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ప్రవాస భారతీయుడు శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మిస్తున్నారు. అయితే తమ సినిమా సెన్సార్ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని నిర్మాత తెలిపారు. సెన్సార్ బోర్డు సభ్యులు చైనాకు భయపడి తమ గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మూవీలో చైనా పేరును ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు సూచించందని శంకర్ నాయడు తెలిపారు. మనదేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపుదిద్దుకున్న మొదటి సినిమా అని.. అటువంటిది చైనా పదం తొలగించాలనడం కరెక్ట్ కాదన్నారు. 1950 నుండి చైనా అనేక ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలతో భారతదేశాన్ని దెబ్బతీస్తోందని చెప్పారు. వ్యూహాత్మకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి టిబెట్‌ను స్వాధీనం చేసుకుందని.. సరిహద్దులో మ్యాప్‌లను మారుస్తోందని మండిపడ్డారు. గాల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై దాడికి దిగిందన్నారు.
‘‘ఇది ఎంత అరాచకం.. ఎంత అవమానకరం.. గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా..? మనం చైనాకు లొంగిపోతున్నామా..? అని శంకర్ నాయుడు ప్రశ్నించారు. మనం మౌనంగా ఉండలేం., బలహీనంగా ఉండలేం. మన జాతీయ చిహ్నమైన 4 సింహాల యొక్క ధైర్యం, పోరాట స్ఫూర్తిని మనం కలిగి ఉండాలి. సింహంలా ఉండండి, “భారతీయన్స్” చిత్రానికి మద్దతు ఇవ్వండి’’ అని ఆయన కోరారు.