Bhoothaddam Bhaskar Narayana Review : ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ

By :  Babu Rao
Update: 2024-03-01 12:25 GMT

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. బట్ కొన్నాళ్లుగా తెలుగు సినిమా మార్కెట్ డల్ అయింది. వస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ ను గెలుచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. మరి ఈ మార్చి నెలను గ్రాండ్ గా స్టార్ట్ చేసేందుకు కొన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో భూతద్దం భాస్కర నారాయణ ఒకటి. శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో ఆకట్టుకుంది. ప్రమోషనల్ గా మెప్పించింది. మరి సినిమాగా ఎలా ఉంది..? కంటెంట్ పరంగా ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..

కథ :

భాస్కర్ నారాయణ చిన్నప్పటి నుంచీ డిటెక్టివ్ కావాలని ప్రయత్నించి లోకల్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ అతనితో పాటు తెలుగు, కన్నడ పోలీస్ లకు ఓ పెద్ద సవాల్ ఎదురవుతుంది. పదిహేడేళ్లుగా ఒక సైకో కిల్లర్ వరుసగా మహిళలను చంపేస్తూ, తల లేని వారి శవాలను రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవుల్లో పడేస్తుంటాడు. అన్నేళ్లుగా అతనికి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. మొదట్లో లైట్ తీసుకున్నా.. భాస్కర్ కు తను ఖచ్చితంగా ఆ కేస్ ను ఛేదించాల్సిన పరిస్థితి వస్తుంది.. మరి అతను ఆ కేస్ ను ఛేదించాడా..? ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు..? ఎందుకు చంపుతున్నాడు..? కేస్ ను సాల్వ్ చేయడంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత వరకూ ఉంది.. ఈ కథలో లక్ష్మి పాత్ర ఏంటీ అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ, ప్లస్ పాయింట్స్ :

మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అనగానే ఓ హత్య, దాని మోటో, ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు అంటూ ఒక్కో క్లూ సంపాదిస్తూ హీరో చివరికి విలన్ వరకూ చేరడం అనే టెంప్లేట్ ఖచ్చితంగా ఉంటుంది. భూతద్దం భాస్కర నారాయణ కూడా అలాగే మొదలవుతుంది. తల లేని మొండెం ఉన్న శవాలు, ఆ శవాలపై చెక్కతో చేసిన భయం కలిగించే బొమ్మలు.. ఉండటం అనే సన్నివేశంతో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో పరిచయానికి, అతని ప్రేమకథతో పాటు, అతని తెలివిని చూపించే కొన్ని సన్నివేశాలతో సాగుతుంది. దీంతో ఓ రేంజ్ లో స్టార్ట్ అయిన సినిమా ఇలా డల్ గా సాగుతుందేంటా అనే అసహనం కలుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కు ముందు ఓ లాక్ పడుతుందో.. అక్కడి నుంచి కథనంలో వేగం మొదలవుతుంది. మామూలుగా ఇలాంటి థ్రిల్లర్స్ అన్నీ సైకోల కోణంలోనే చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఈ మూవీలో పురాణాలను కలపడంతో ప్రేక్షకులకు ఓ కొత్త కథ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చివరి 40ల నిమిషాల కథనం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు హంతకుడు ఎవరు అనేది తెలియడంతో పాటు అతను ఆ హత్యలు చేస్తున్న కారణాలు తెలిసిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక క్లైమాక్స్ ఊహించేదే అయినా.. అక్కడి వరకూ తీసుకువెళ్లిన విధానం సింప్లీ సూపర్బ్ అనిపిస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి పురాణాలను యాడ్ చేయడం ద్వారా ఈ దర్శకుడు ఇప్పటి వరకూ చూసిన ఈ తరహా సినిమాలకు భిన్నమైన అనుభూతిని ఇస్తాడు. ఇందుకోసం పురాణాల నుంచి అతను చేసిన రీసెర్చ్ కూడా మెచ్చుకోదగ్గదే. నిజంగా అలాంటి వాళ్లు ఉండే ఉంటారు అనేంత నమ్మకాన్ని అతని రీసెర్చ్ కల్పిస్తుందంటే అతిశయోక్తి కాదు.

మైనస్ లేంటీ.. నటన ఎలా ఉంది..?

భూతద్దం భాస్కర నారాయణ ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు కథేంటో చెప్పకుండా టైమ్ పాస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల మొదటి భాగంలో చాలాసార్లు నిట్టూర్పులు వినిపిస్తాయి. అలాగే కథకు సంబంధం లేని హత్య, దాన్ని ఛేదించిన తర్వాత తెలిసిన విషయాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు కథలోకి తీసుకువెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయినా సెకండ్ హాఫ్ బావుండటంతో ఈ మైనస్ లన్నీ తేలిపోయినట్టే కనిపిస్తాయి. భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి బాగా నటించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ సొంత తెలివి తేటలతో చాలా కేస్ లు ఛేదించడంలో పోలీస్ లకు సహాయం చేస్తుంటాడు. అలాంటి తనుకు 17 హత్యలు చేసిన వాడిని కనిపెట్టడం అనేది పెద్ద టాస్క్. ఆ టాస్క్ ను ఛేదించడంలో నటన పరంగా మరింత మెరుగ్గా కనిపిస్తాడు శివ. లక్ష్మీగా రాశి సింగ్ లోకల్ విలేకరిగా మెప్పిస్తుంది. ఈ ఇద్దరి పేర్లకు, క్లైమాక్స్ లోని విలన్ కు ఉన్న లింక్ దర్శకుడి ఇంటెలిజెన్సీని తెలియజేస్తాయి. ఈ ఇద్దరినీ ఇన్ డైరెక్ట్ గా లక్ష్మీ నారాయణులుగా చూపించాడు దర్శకుడు పురుషోత్తం రాజ్.ఇతర క్యారెక్టర్స్ లో శివ నారాయణకు అలవాటైన పాత్ర. దేవీ ప్రసాద్ కు ఓ కొత్త రోల్ దొరికింది. బాగా చేశాడు. షఫీ, వర్షిణి పాత్రలన్నీ రొటీన్.

టెక్నికల్ గా :

టెక్నీకల్ గా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఒక్కటే పాట ఉండటం కొంత రిలీఫ్ గా ఉంది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో చాలా కట్ చేయొచ్చు అనిపిస్తుంది. డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. ఇతర టెక్నికల్ అంశాలన్నీ మెప్పిస్తాయి. దర్శకుడుగా పురుషోత్తం రాజ్ ఓ కొత్త నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథను ప్రభావవంతంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాడు. ఈ తరహా కథల్లో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో పురుషోత్తం రాజ్ కృషిని మెచ్చుకోవాల్సిందే.

ఫైనల్ గా : మైథలాజికల్ థ్రిల్లర్

రేటింగ్ : 2.75./5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News