Gudachari-2 Updates : గూఢచారి-2లో విలన్గా..బాలీవుడ్ రొమాంటిక్ హీరో
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో నటించాలంటే నో అన్న బాలీవుడ్ తారలు సైతం ఇప్పుడు మనవారితో నటించడానికి తెగ ఆసక్తిని చూపుతున్నారు. ట్రెండ్ మారడంతో ఒకప్పుడు హీరోలు సైతం విలన్లుగా ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. ఒకప్పుడు వరుస రొమాంటిక్ సినిమాలతో సీరియల్ కిస్సర్‌గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి..ఇప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో విలన్‌గా ఇమ్రాన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఇటు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’లోనూ విలన్‌గా చేస్తున్నాడు. తాజాగా మరో తెలుగు చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించబోతున్నాడు.
అడవి శేష్ హీరోగా తెరకెక్కిన గూఢచారికి సీక్వెల్ స్టార్ట్ కానుంది. 2018లో రిలీజైన గూఢచారి మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత గూఢచారి సీక్వెల్ చేయాలని శేష్ అనుకున్నప్పటికీ నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పటికి కుదిరింది. విజయ్ కుమార్ డైరెక్షన్ లో శేష్ హీరోగా గూఢచారి 2 మూవీ తెరకెక్కుతోంది. బనిత సంధు హీరోయిన్ గా నటిస్తోంది. స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సూపర్ హిట్ మూవీ గూఢచారి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గూఢచారి 2 అసలు సిసలైన స్పై థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందని మేకర్స్ అంటున్నారు.