వెంకీ, నాగ్ ల బాక్సాఫీస్ వార్.. ఈ సారి విన్నర్ ఎవరో

Update: 2023-10-06 09:17 GMT

సంక్రాంతి పండగ సంబరాలతో పాటు సరికొత్త సినిమాలను కూడా తెస్తుంది. అసలు కొత్త సినిమా పోస్టర్ లేకుండా సంక్రాంతి ఏంటీ అనే ఆంధ్రులు కూడా ఉన్నారు. అందుకే ఈ పండగకు ఫుల్ డిమాండ్. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారంతో, మాస్ రాజా రవితేజ ఈగల్ గా కుర్ర దర్శకుడు హీరో చేసిన హను మాన్ బరిలో ఉన్నాయి. వీరితో పోటీకి సై అంటూ నా సామిరంగా అని నాగార్జున కాలు దువ్వుతున్నాడు. తాజాగా ఈ వార్ లోకి ఎంటర్ అయ్యాడు మరో స్టార్ వెంకటేష్. వెంకీ కూడా సంక్రాంతి బరిలోనే సైంధవ్ లా సంహారానికి సిద్ధం అంటున్నాడు. మరి కాంపిటీషన్ ఉంటేనే కదా ఖలేజా తెలిసేది. మరి ఈ వార్ లో ఎవరు ఎలా ఉన్నా.. వెంకటేష్, నాగార్జున ఇంతకు ముందు ఎన్ని తలపడ్డారు. ఇప్పుడీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఆ టైమ్ లో విన్నర్స్ ఎవరు అనే టాపిక్ హాట్ గా సాగుతోంది. మరి ఆ కతేందో చూద్దామా.. ?

వెంకటేష్, నాగార్జున మాజీ బంధవులు. ఆ గొడవ పక్కన బెడితే ఫస్ట్ ఈ ఇద్దరూ ఒక్క వారం గ్యాప్ లో బాక్సాఫీస్ వార్ లో తలపడింది 1989లో. వెంకటేష్ ప్రేమ సినిమాతో జనవరి 12న సంక్రాంతిబరిలో దిగాడు. ఈ మూవీ ఆ తర్వాత వారం రోజులకు జనవరి 19న నాగార్జున విక్రమ్ సినిమా విడుదలైంది. ఇందులో ప్రేమ బ్లాక్ బస్టర్ తో పాటు.. క్లాసిక్ కూడా అనిపించుకుంది. నాగార్జున విజయ్ మాత్రం ప్రేమ ముందు తేలిపోయింది. ఆ తర్వాత అందరిలోనూ భారీ అంచనాలు పెంచి ఒకే రోజు విడుదలైన సందర్భం 1992లో జరిగింది. 1992 జనవరి 10న వెంకీ, నాగ్ చంటి, కిల్లర్ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడ్డారు. ఇక ఇక్కడ రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. యస్.. చంటి ఆల్ టైమ్ హిట్స్ జాబితాలో నిలిస్తే.. అప్పటికి కాస్త కొత్త ప్రయోగంగా అనిపించిన కిల్లర్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కిల్ అయిపోయింది. ఇక్కడ కిల్లర్ స్ట్రెయిట్ మూవీ అయితే చంటి రీమేక్.

వెంకటేష్, నాగార్జున మరోసారి బాక్సాఫీస్ బరిలో రెండు వారాల గ్యాప్ లో తలపడిని యేడాది 1996. 1996 అక్టోబర్ 4న నిన్నే పెళ్లాడతా విడుదలైంది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అదే నెలలో 17న వెంకటేష్ పవిత్ర బంధం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. సో ఇక్కడ వెంకీ ఫ్లాప్ అవలేదన్నమాట. అయితే మరోసారి వీరు తలపడినప్పుడు ఇద్దరూ ఒకే రిజల్ట్ చూశారు. అది 2013లో. అప్పటికే నాగ్, వెంకీ వరుస ఫ్లాపుల్లో ఉన్న సందర్భం. ఈ సారి కూడా వీరి మధ్య ఒక వారం గ్యాప్ ఉంది. 2013 ఏప్రిల్ 26న వెంకీ షాడో వచ్చింది. ఆ షాడో ఆడియన్స్ ను ఎంత భయపెట్టిందో ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ నెక్ట్స్ వీక్ మే 4న నాగార్జున గ్రీకు వీరుడు విడుదలైంది. ఈ వీరుడు బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా పోయిందో కూడా గుర్తుండే ఉంటుంది.

ఇన్నాళ్లకు మరోసారి ఈ మాజీ బంధువులు బాక్సాఫీస్ వద్ద వార్ కు సిద్ధమయ్యారు. అదీ సంక్రాంతికే. నాగ్ ఇంకా డేట్ చెప్పలేదు కానీ.. వెంకటేష్ మాత్రం 2024 జనవరి 13న సైంధవ్ ను విడుదల చేస్తున్నా అన్నాడు. దీనికి చాలా రోజుల ముందే.. నాగార్జున నా సామిరంగా సంక్రాంతి బరిలోనే దిగుతున్నా అని తొడకొట్టి ఉన్నాడు. దీంతో మరోసారి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ షురూ అయింది. మళ్లీ మా హీరోదే విజయం అని వెంకీ ఫ్యాన్స్ అంటుంటే.. ఈ సారి నాగ్ ను కొట్టడం అసాధ్యం అని ఈ ఫ్యాన్స్ అంటున్నారు. అయినా ఇలా కొట్టుకోవడం కంటే రెండూ బ్లాక్ బస్టర్స్ కావాలని కోరుకోవచ్చు కదా అంటే వినరు. అవున్లే.. వింటే వాళ్లు ఫ్యాన్స్ ఎందుకవుతారు.. అంటారా.. అది మీ ఇష్టం.

Tags:    

Similar News