Chota K Naidu Sorry : స్టేజ్ మీదే ఛోటా కె నాయుడితో సారీ చెప్పించుకున్న అనసూయ

Update: 2023-09-24 07:54 GMT

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో.. ఆయన బావమరిది విరాట్ కర్ణ. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు చెందిన ప్రి రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఘనంగా జరిగింది. ఈ మూవీలో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న అనసూయ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇదే విషయమై ఈవెంట్‌లో మాట్లాడుతూ.. సినిమాలో తాను అక్కమ్మ అనే పాత్ర పోషించానని, ఇది తాను చేసిన గొప్ప పాత్రల్లో ఒకటని చెప్పారు. ఈ క్రమంలో స్టేజ్ పై ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు అనసూయకు.. స్టేజీ మీద సారీ చెప్పారు. ఎందుకు అంటే..

ముందుగా సుమ చేతి నుంచి అనసూయ మైక్ అందుకోగానే .. ఆడియన్స్ అంతా ఒక్కసారిగా అరిచారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘నిజాయతీగా చెప్పాలంటే మీరు నన్ను అభినందిస్తూ ఓ ఏసుకున్నారో, ట్రోల్ చేస్తూ ఏసుకున్నారో అర్థం కావడంలేదు. కానీ, పెదకాపు-1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన తరవాత, ఈ సినిమాలో భాగం అయిన తరవాత నాకొక కొత్త గౌరవం అనేది తప్పకుండా ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. సినిమా చూసిన తరవాత మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. ఈ సినిమాలో నటించడం నా అదృష్టం. దీనంతటికీ కారణమైన శ్రీకాంత్ అడ్డాల గారికి థాంక్యూ సో మచ్ నాకు అక్కమ్మను ఇచ్చినందుకు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

రంగమ్మత్త పాత్రను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడి తనను అలాగే పిలుచుకుంటున్నారో.. పెదకాపు సినిమా తరవాత తనను అక్కమ్మ అని అంతే ఇష్టంతో పిలుచుకుంటారనే గట్టి నమ్మకం తనకు ఉందని అనసూయ అన్నారు. ఈ క్రమంలో ఆమె ఛోటా కె నాయుడును పిలిచి.. తన గురించి ఎందుకు మాట్లాడలేదని అడిగారు. కానీ, తాను మాత్రం ఛోటా గురించి మాట్లాడడం మరిచిపోలేదని అన్నారు. వెంటనే మైక్ అందుకున్న ఛోటా.. ‘అనసూయ క్యారెక్టర్ సినిమాలో లేట్‌గా రివీల్ చేస్తారు. నేను కూడా లేట్‌గా చెబుదామని ఆపేశాను. అనసూయ చాలా ప్రౌడ్‌గా చెప్పాల్సిన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. శ్రీకాంత్ చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. కానీ ఈ అమ్మాయి ఫస్ట్ రెయిన్ ఎఫెక్ట్‌లో చేసిన తరవాత శ్రీకాంత్ వెరీగుడ్ ఛాయిస్ అని చెప్పాను’ అని అన్నారు. దీంతో ఛోటా దగ్గరకు వెళ్లిన అనసూయ.. ‘ఛీ అడిగి మరీ చెప్పించుకున్నట్టు ఉంది’ అని అన్నారు. వెంటనే ఛోటా.. ‘సారీ అనసూయ, ఐ మీన్ ఇట్’ అంటూ హంబుల్‌గా క్షమాపణలు చెప్పారు. ‘అయ్యో సార్.. మీరు సారీ చెప్పడమేంటి’ అంటూ నవ్వుతూ అనసూయ బదులిచ్చారు.


Tags:    

Similar News