Bigg Boss Season 7 telugu : ‘‘బిగ్ బాస్ షో.. బూతుల ప్రపంచం’’.. CPI నారాయణ

Byline :  Veerendra Prasad
Update: 2023-09-06 03:16 GMT

బిగ్ బాస్ షో కోసం వెయిట్ చేసే క్రేజీ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో.. అంతే స్థాయిలో ఆ రియాల్టీ షో ను చీదరించుకునే వాళ్లు కూడా ఉంటారు. బిగ్ బాస్ షో అంటే గిట్టని వాళ్లు కూడా కోకోల్లలు. అందులో కొందరు బాహాటంగానే బిగ్ బాస్ షో మీద మాటల దాడి చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు అయితే ప్రతీ సీజన్ ప్రారంభ సమయంలో కాస్త హడావిడి చేస్తుంటారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీపీఐ నారాయణ గురించి. ఇప్పటికే ఆయన బిగ్ బాస్ షో మీద హైకోర్టులోకేసు కూడా వేశారు. అయితే అక్కడ వర్కవుట్ కాలేదని నేరుగా సుప్రీంకు వెళ్తానంటున్నారు. బిగ్ బాస్ షో యువతను తప్పుదారి పట్టించేలా ఉందని.. ఈ కార్యక్రమంలోని సన్నివేశాలు నైతిక విలువలను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ మంగళవారం ఓ వీడియో ద్వారా మండిపడ్డారు.

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని, కళామ్మతల్లికి అన్యాయం చేస్తున్నారన్నారు. బిగ్ బాస్ అనేది చాలా అనైతిక షో అని, బూతుల ప్రపంచం అని ఆయన విరుచుకుపడ్డారు.బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇలాంటి బిగ్ బాస్ ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం (State Govt) కానీ ఎందుకు అనుమతిస్తోంది. ఇదో బూతుల ప్రపంచం. ఈ బూతుల ప్రపంచాన్ని వందల, వేల కోట్ల వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో బిగ్ బాస్‌కి అనుమతి ఇవ్వడం చాలా ఘోరం. హౌస్‌లో వాళ్ళ కీచులాటలు, పోట్లాటలు.. ఓ అనైతిక పద్ధతైన వ్యవహారం ఇదని విరుచుకుపడ్డారు.

అందువల్ల ఈ షో అంశాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా స్వీకరించి కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. బిగ్ బాస్ సంస్కృతి బీజేపీ సంస్కృతి ఒక్కటేనా అని ప్రశ్నించారు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బిగ్ బాస్‌పై పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం లేదని.. కోర్టులను ఆశ్రయించినా బిగ్ బాస్ షో జోలికి పోవడం లేదన్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు శక్తివంతులు కావడం వల్లే దీని జోలికి ఎవరూ వెళ్లడం లేదని ఆరోపించారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.




Tags:    

Similar News