డెవిల్ మూవీ రివ్యూ

By :  Babu Rao
Update: 2023-12-29 09:17 GMT

తారగణం : కళ్యాణ్ రామ్, సంయుక్త, మాళవిక నాయర్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, మార్క్ బెన్నింగ్ టన్, ఎల్నాజ్ నోరౌజ్ తదితరులు

ఎడిటర్ : తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్

సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా

నిర్మాత, దర్శకత్వం : అభిషేక్ నామా(..??)


లాస్ట్ ఇయర్ బింబిసారతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. అదే ఊపులో భారీ అంచనాలతో వచ్చిన అమిగోస్ డిజాస్టర్ అయింది. అయినా బింబిసార ఇచ్చిన కాన్ఫిడెన్స్ తగ్గలేదు. ఈ కారణంగానే అతని కొత్త సినిమా డెవిల్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. కాకపోతే దర్శకుడి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. నిర్మాతే దర్శకుడుగానూ తన పేరు వేసుకున్నాడు అన్నారు. అయినా సినిమా బావుంటే చాలు అనుకునే ఆడియన్స్ కు దర్శకుడు ఎవరైతే ఏంటీ..? అందువల్ల ఈ డెవిల్ ఎలా ఉందో చూద్దాం..

కథ :

డెవిల్ మూవీ 945 కాలంలో సాగే కథ. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు డెవిల్ (కళ్యాణ్ రామ్). తన పేరుకు తగ్గట్టుగానే చాలా సాహసవంతుడైన ఆఫీసర్. బ్రిటీష్ ప్రభుత్వానికి కంటిలో నలుసుగా మారిన ఎన్ఐఏ (నేషనల్ ఇండియన్ ఆర్మీ) చీఫ్ సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునే ప్రయత్నాల్లో ఉంటారు. అతనితో పాటు ఆ ఆర్మీలో కీలకంగా ఉన్న త్రివర్ణ కోసం వెదుకుతుంటారు. అందుకు సంబంధించి ఓ కీలకమైన సమాచారం అందుతుంది. మరోవైపు మద్రాస్ సంస్థానంలో ఉన్న రాసపాడు అనే ఊరిలో ఓ పెద్ద ఇంట్లో హత్య జరుగుతుంది. డెవిల్ ను ఆ హత్య కేస్ ను ఛేదించమని పంపుతుంది బ్రిటీష్ ప్రభుత్వం. అక్కడ అతనికి నైషద(సంయుక్త) పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. దీంతో పాటు వెళ్లి హత్య కేస్ ను సాల్వ్ చేసే క్రమంలో అనేక విషయాలు తెలుసుకుంటాడు. అవేంటీ..? డెవిల్ లాంటి డేరింగ్ ఏజెంట్ ను ఓ సాధారణ హత్య కేస్ ను ఛేదించమని ప్రభుత్వం ఎందుకు పంపించింది..? సుభాష్ చంద్రబోస్ ను బ్రిటీష్ వాళ్లు పట్టుకున్నారా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..

కొన్ని కథలు ఎలా ఓపెన్ అవుతాయి అనేది కీలకం. అలా ఓపెన్ అయిన సినిమాలు ఆ కంటెంట్ నుంచి మరో కంటెంట్ కు వెళ్లడం చాలాసార్లు చూశాం. డెవిల్ కూడా ఓ మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. ఈ హత్య కోణంలో కథనం సాగుతుంది అనిపించినా.. ఆ హత్యకు ఈ కథకు పెద్దగా సంబంధం లేదు. కేవలం ఆ హత్య జరిగిన ఇంటిలోని మనిషి కోసమే డెవిల్ ను అక్కడికి పంపిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఆ మనిషికి దగ్గర కావడం కోసం.. ఈ హత్య కేస్ ను ఛేదించే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో సాగే ఇన్వెస్టిగేషన్ చూస్తున్నప్పుడు సహజంగానే సుభాష్ చంద్రబోస్ కథలో మర్డర్ మిస్టరీ ఏంటా అనిపిస్తుంది. మరోవైపు చాలా ఎక్కువ బిల్డప్ తో చూపించిన త్రివర్ణ పాత్రను రివీల్ చేసిన తర్వాత ఇక కళ్యాణ్ రామ్ చేసేది ఏముందీ అనిపిస్తుంది. బట్.. ఇంటర్వెల్ ఫైట్ చాలా బావుంది. బట్ ఇక్కడి వరకూ మర్డర్ మిస్టరీతో పాటు మరెన్నో సందేహాలకు తావిస్తూ వెళతాడు దర్శకుడు. కథనం కూడా కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాగని బోరింగ్ గా ఉండదు. ఇంటర్వెల్ టైమ్ లోనే కళ్యాణ్ రామ్ వేరే క్యారెక్టర్ బయటకు వస్తుందనుకుంటాం. బట్ దర్శకుడు సెకండ్ హాఫ్ కోసం దాచిపెట్టాడు. సెకండ్ హాఫ్ నుంచి కథనంలో మరింత వేగం అందుకుంటుంది.

హైలెట్స్ ఏంటీ .. :

సెకండ్ హాఫ్ సగం తర్వాత వచ్చిన ట్విస్ట్ చాలా బాగా వర్కవుట్ అయింది. ఆపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ అనేలా ఉంది. ఈ ఫైట్ ను అద్భుతంగా కంపోజ్ చేశారు. హీరో పాత్రను ఎలివేట్ చేసేలా యాక్షన్ కొరియోగ్రఫీ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత నైషద ఎపిసోడ్.. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ చాలా వేగంగా వెళ్లిపోతుంది. చివరికి సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ వారికి చిక్కకుండా చేయగలుగుతారు. కథ ప్రధాన ఉద్దేశ్యం సుభాస్ చంద్రబోస్ ను కాపాడటం. అందుకు అవసరమైన కీ పాయింట్స్ కొన్ని మొదట హత్య జరిగిన ఇంట్లోనే ఉండటం వల్ల కథనం అక్కడి నుంచి మొదలుపెట్టాడు దర్శకుడు. దీంతో చాలామంది మర్డర్ మిస్టరీ, దేశభక్తికి ముడిపెట్టారు అనుకుంటున్నారు. బట్ మర్డర్ మిస్టరీని కథలో భాగంగా చూడక్కర్లేదు. కేవలం ఆ ఇంట్లో ఉన్న నైషద కోణంలోనే చూడాలి. అప్పుడే ఇంకాస్త క్లియర్ గా అర్థం అవుతుంది.

మైనస్ లేంటీ :

ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్లినా.. అసలు పాయింట్ అయిన సుభాస్ బోస్ కోణం వరకూ రావడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఈ రెంటికీ ముడిపెట్టడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయి. కొన్ని పాత్రలకు ఇచ్చిన బిల్డప్ ను కంటిన్యూ చేయలేకపోవడం.. డెవిల్ ఎవరు అనేది సులభంగానే ఊహించేలా ఉండటం.

ఎవరెలా చేశారు :

డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. పాత్రను బాగా అర్థం చేసుకున్నాడు. సంయుక్తకు చాలా రోజుల తర్వాత మరో బలమైన పాత్ర దొరికింది. తను బాగా చేసింది.కేజీఎఫ్ సింహా, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య పాత్రల మేరకు బాగా ఆకట్టుకున్నారు.

టెక్నికల్ వర్క్ ఎలా ఉంది :

టెక్నికల్ టీమ్ ఈ మూవీ విజయంలో కీలకంగా కనిపిస్తారని చెప్పాలి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం స్మూత్ గా కనిపిస్తూ ఎలివేషన్ టైమ్ లో హై గా మారుతుంది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. 1945ల కాలం నాటి యాంబియన్స్ కనిపించేలా బాగా పిక్చరైజ్ చేశాడు. ఎడిటింగ్ బావుంది. సెట్స్, ఆర్ట్ వర్క్ ఆ కాలాన్ని ప్రతిబింబించాయి. డైలాగ్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బాగా కనిపిస్తాయి. దర్శకుడుగా (నిజంగా అతనే చేసి ఉంటే)అభిషేక్ నామాకు పూర్తిగా పాస్ మార్కులు వేయొచ్చు(నిజంగా అతనే చేసి ఉంటే).

సుభాస్ చంద్రబోస్ పాత్రే లేకుండా.. చివర్లో కూడా సజెషన్ లో కనిపించే షాట్ తో సినిమా అంతా అతని నేపథ్యంలో నడిపించడం చాలా బావుంది. స్క్రీన్ ప్లే పరంగా ఈ ఎత్తుగడ వర్కవుట్ అయిందనే చెప్పాలి. 

రేటింగ్ : 3/5

                                                                                  - బాబురావు. కామళ్ల

Tags:    

Similar News