Dil Raju : ‘నిజాలు తెలుసుకుని రాయండి’.. ఆ వార్తలపై మండిపడ్డ దిల్రాజు
సంక్రాంతి సీజన్ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులకు పండగే. వరుసగా చిన్నాపెద్దా సినిమాలన్నీ రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి. వరుస సెలవులు కావడంతో.. అభిమానులు కూడా థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. నాలుగు పెద్ద సినిమాలు ఈ రేసులో ముందున్నాయి. ముందుగా ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. రవితేజ ఈగల్ సినిమా పోటీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని చెప్తూ ఈగల్ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. తమ సినిమాను ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు.
ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు స్పందించారు. దిల్ రాజు సంక్రాంతి సినిమాలపై, వాటిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ సినిమా వెనక్కి తగ్గినంత మాత్రాన ఏదో జరిగినట్లు కాదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. దయచేసి నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు. ఈగల్ సినిమా వాయిదా వేసుకున్నందుకు రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గుంటూరు కారం, హనుమాన్ ఒకే రోజున విడుదల కాబోతున్నాయని.. అయితే ఈ సినిమాలు వేర్వేరుగా వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు.