తిరుమలలో కృతి ముద్దు వ్యవహారం..స్పందించిన దీపికా

Update: 2023-06-09 15:10 GMT

ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన మూవీ ఆదిపురుష్. ఈ నెల 16న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ను ముద్దు పెట్టుకుని, హగ్ చేసుకున్నాడు. అయితే దీనిపై వివాదం చెలరేగింది. దైవసన్నిధిలో ఇలా వ్యవహరించడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

ఇదే అంశంపై రామాయణ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిక్లియా స్పందించారు. కృతిసనన్‌, ఓంరౌత్‌పై వ్యహరించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి నటీనటులు సీతను కేవలం ఒక పాత్రగానే చూస్తున్నారని, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘‘కృతిసనన్‌ ఈతరం నటి కాబట్టి ముద్దుపెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం కామన్ అనుకుంటారు. ఆమె తనని తాను ఒక సీతమ్మగా భావించలేదు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం’’ అని అన్నారు.

‘‘అప్పట్లో నేను సీత పాత్రలో జీవించాను. కానీ ఇప్పటితరం నటీమణులు సీతమ్మను కేవలం ఒక పాత్రగానే చూస్తున్నారు. మా రోజుల్లో అలా కాదు. మేము ‘రామాయణం’ సీరియల్లో నటిస్తున్నప్పుడు సెట్‌లో మమ్మల్ని ఎవరూ పేరు పెట్టి పిలిచేవారు కాదు. అలాగే, మేము పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఎంతోమంది మా పాదాలకు నమస్కారం చేసేవాళ్లు. మమ్మల్ని ఎప్పుడూ నటీనటులుగా కాకుండా దేవుళ్లుగా భావించేవారు. అలాగే, మేము ఎవరినీ ఆలింగనం చేసుకునేవాళ్లం కాదు’’ అని దీపకా చిక్లియా చెప్పారు.

ఇక ఆదిపురుష్ మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఆదిపురుష్ రన్ టైం మాత్రం అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగానే ఉంది. తాజాగా ఈ మూవీ నిడివి 179 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. అంటే ఒక నిమిషం తక్కువ మూడు గంటల నిడివితో ఆదిపురుష్ థియేటర్లోకి రాబోతోంది. మొత్తంగా ఆదిపురుష్‌ని థియేటర్లో చూడాలంటే మూడున్నర గంటలకు పైగా సమయం కేటాయించాల్సిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ నడిచే ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Tags:    

Similar News