ఈ ఎన్నికలు చూస్తుంటే సిగ్గేస్తుంది.. తమ్మారెడ్డి హాట్ కామెంట్స్
ఈరోజు(ఆదివారం) జరుగుతున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) ఎన్నికలను చూస్తుంటేసిగ్గేస్తుందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ . ఫిల్మ్ ఛాంబర్‌కి ఎన్నికలు జరుగుతున్నాయని ఆనంద పడాలో, లేక జనరల్ ఎలక్షన్లని తలపిస్తున్నాయని సిగ్గుపడాలో తెలియడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన తమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.
‘‘నేను ఛాంబర్‌లో 15 ఏళ్లు పనిచేశా. మా నాన్న కూడా పని చేశారు. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎలక్షన్లు చూశాను. ప్రెసిడెంట్‌గా గెలిచాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని ఇంతకుమునుపు ఎప్పుడూ చూడలేదు. బయట, లోపల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలా, లేక జనరల్ ఎలక్షన్‌లను తలపిస్తున్నాయని సిగ్గుపడాలా? అన్నది తెలియడం లేదు. ఎన్నికల క్యాంపెయిన్ చూస్తుంటే భయమేస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.