ఫ్యామిలీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరూ స్టారే - ఫ్యామిలీ స్టార్ టీమ్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమా హైలైట్స్ ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్ గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్ మీరు చూశారు మీ అందరికీ నచ్చింది. అందుకే మీలోనూ ఆ హ్యాపీనెస్ కనిపిస్తోంది. పరశురామ్ ఈ కథ చెప్పగానే అందులోని పాయింట్ నన్ను ఎగ్జైట్ చేసింది. స్టోరీని డెవలప్ చేశాక మేమంతా ఇంప్రెస్ అయ్యాం. విజయ్, పరశురామ్ కలిసి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్ లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ స్టార్ కు విజయ్ క్యారెక్టరైజేషన్ వెన్నెముక లాంటిది. విజయ్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్ చేస్తాడు..ఇలా అన్ని షేడ్స్ హీరో క్యారెక్టర్ లో ఉన్నాయి. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పవచ్చు. ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. 30 పర్సెంట్ ఫ్యామిలీ స్టోరీ, 70 పర్సెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. శతమానం భవతి రిలీజైనప్పుడు యూత్ ఆడియెన్స్ సీరియల్ లా ఉందని అన్నారు. కానీ ఫ్యామిలీస్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ అయినప్పుడు వివిధ రకాల స్పందనలు వస్తాయి. కానీ చివరకు అది ఇచ్చే బాక్సాఫీస్ రిజల్ట్ ఇంపార్టెంట్. ఏ సినిమా వందకు వందశాతం ప్రేక్షకులకు నచ్చదు. లోపాలు వెతికేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మాకు వంద మంది ప్రేక్షకుల్లో 75 మంది సినిమా నచ్చిందని చెప్పినా మేము ఫస్ట్ క్లాస్ లో పాసయినట్లు భావిస్తాం. నేను మేకింగ్ టైమ్ నుంచి థియేటర్ లో రిలీజ్ వరకు ప్రతి సందర్భంలో చెక్ చేసుకుంటా. మృణాల్ లక్కీ హీరోయిన్. సీతారామం, హాయ్ నాన్న సక్సెస్ తర్వాత ఫ్యామిలీ స్టార్ తో ఆమె హ్యాట్రిక్ అందుకోబోతోంది. దర్శకుడు పరశురామ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా డబ్బింగ్, మిక్సింగ్ వర్క్స్ చేయిస్తున్నాడు. మా సంస్థలో విజయ్ తో తను చేస్తున్న సినిమాను సక్సెస్ చేయాలనే తపన పరశురామ్ లో ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్, ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్, ఆర్ట్ ఏఎస్ ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్..ఇలా వీళ్లంతా తమ బెస్ట్ ఇచ్చారు. మా సంస్థలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ విషయంలో నా గురి తప్పలేదు. ఒక్క శ్రీనివాస కల్యాణం సినిమా మాత్రమే అనుకున్నంత ఫలితం రాలేదు. మన ఇండియన్ కల్చర్ లోనే ఫ్యామిలీ అంటే మనకొక విడదీయని అనుబంధం ఉంటుంది. అలాంటి కుటుంబానికి తను అండగా నిలబడి అభివృద్ధిలోకి తీసుకొచ్చేవారు ఎందరో ఉంటారు. అలాంటి వారంతా ఫ్యామిలీస్టార్స్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. అమెరికా లాగ మనం పదహారేళ్లకు పిల్లల్ని వారి దారిన వారిని వదిలేయం. రెండు మూడు తరాలు కలిసి ఉంటాయి. ఆ ఫ్యామిలీ వ్యాల్యూస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఏప్రిల్ 5 నాకు ఎంతో స్పెషల్. ఆ రోజుతో దిల్ సినిమా రిలీజ్ తో నేను రాజు నుంచి దిల్ రాజు అయ్యాను. అప్పటి నుంచి మొన్నటి బలగం సినిమా వరకు మీరూ, ప్రేక్షకులూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ఇకపైనా కొనసాగాలి. మీడియా మిత్రులు వారి కుటుంబ సభ్యులతో ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మీడియా మిత్రుల ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీ స్టార్ స్పెషల్ షో అరేంజ్ చేస్తున్నాం. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎనర్జిటిక్ గా పాటలు పాడుతున్నా, డ్యాన్సులు చేస్తున్నా. అంతేగానీ స్క్రీన్ మీద నటించే ఆలోచన లేదు. విజయ్ హీరోగా మా సంస్థలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ఉంటుంది. దానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు టైమ్ పట్టేలా ఉంది. అదంతా పూర్తయ్యాక ఆ మూవీ తప్పకుండా సెట్స్ మీదకు తీసుకెళ్తాం. విజయ్ ప్రొడ్సూసర్స్ గురించి ఆలోచించే హీరో. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా. అన్నారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ - సీతారామం సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఇంత గొప్ప కెరీర్ ఉంటుందని అనుకోలేదు. సీతారామం తర్వాత హాయ్ నాన్న వంటి మంచి స్క్రిప్ట్ దొరికింది. ఈ రెండు సినిమాల తర్వాత నేను చేసే సినిమాల స్పెషల్ గా ఉండాలని అనుకున్నా. అలాంటి స్పెషల్ స్కిప్ట్ ను పరశురామ్ గారు నెరేట్ చేశారు. గోవర్థన్, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్ మధ్య బ్యూటిఫుల్ గా స్టోరీ ఉంటుంది. మన జీవితం అర చేతిలాంటిది. మన వేళ్లలాగే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన జీవితాల్లోని ఎమోషన్స్, రిలేషన్స్, అఛీవ్ మెంట్స్, స్ట్రగుల్స్ అన్నీ ఈ మూవీలో మీరు రిలేట్ చేసుకుంటారు. మనల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించేవారు కుటుంబంలో ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారిని గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ ఫ్యామిలీస్టార్ సినిమా. ఈ సినిమా సైన్ చేసినప్పుడు నేను మా నాన్నతో ఈ సినిమా నీకోసమే చేస్తున్నానని చెప్పా. ఇంతమంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు పరశురామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇందు క్యారెక్టర్ ను నేను పోషించగలనా లేదా అని భయపడ్డాను. కానీ విజయ్ ఎంతో సపోర్ట్ చేశాడు. అలాగే దిల్ రాజు గారు మా అందరికీ బిగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి థ్యాంక్స్. అలాగే నా కుటుంబానికి కూడా థ్యాంక్స్ చెబుతున్నా. యాక్టింగ్ అనేది నా ప్యాషన్. నన్ను నేను చూసుకోగలిగే పాత్రలు, సినిమాలే చేస్తాను. నేను కాదు నా సినిమాలే మాట్లాడాలని భావిస్తుంటా. మీరంతా ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మీ తెలుగు అమ్మాయిగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. అన్నారు
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుంది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకువస్తుంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 8న నాన్న బర్త్ డే. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నా. ఏప్రిల్ 5న రాజు గారు దిల్ రాజు అయ్యారు. ఈ ఏప్రిల్ 5 డేట్ కూడా ఆయన కెరీర్ లో స్పెషల్ కావాలి. నెక్ట్ ఏ జానర్ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉండను. నన్ను అప్రోచ్ అయ్యే డైరెక్టర్స్ చెప్పే కథల్లో బాగుంది అనుకున్నది సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం 9 నెలల వర్క్ చేశాం. అంతకు ఏడాది ముందే డైరెక్టర్ సింగిల్ లైన్ చెప్పాడు. వినగానే నాకు బాగా నచ్చింది. అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయండని అడిగాను. రాజు గారు లాక్ డౌన్ లో నాకు డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు పంపించారు. ఆయనకు సినిమా చేయాలని అనుకున్నా. పరశురామ్ చెప్పిన లైన్ బాగుందని, అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక చేద్దామని రాజు గారికి చెప్పా. ఆయన కొన్ని రోజుల తర్వాత ఫుల్ స్క్రిప్ట్ తో పరశురామ్ తో కలిసి వచ్చారు. ఈ టైమ్ లో నేను డైరెక్టర్ గౌతమ్ కు, సితార సంస్థకు థ్యాంక్స్ చెప్పాలి. మా కాంబోలో సినిమా బిగిన్ అయ్యింది. అయితే అది బిగ్ స్కేల్ సినిమా. ఫ్యామిలీ స్టార్ 80 డేస్ లో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు గౌతమ్, సితార వాళ్లకు చెబితే సరేనన్నారు. 80 డేస్ అనుకున్నది 110, 120 డేస్ అయ్యింది. సంక్రాంతికి రాలేకపోయాం. అయినా మంచే జరిగింది. ఏప్రిల్ 5 పర్పెక్ట్ డేట్ గా భావిస్తున్నాం. నేను లైఫ్ పార్టనర్ చేసుకునే అమ్మాయి మా ఇంట్లో వాళ్లకు నచ్చాలి. అలా నచ్చేలా నేను చూసుకోవాలి. రాజు గారి బ్యానర్ లో కేరింత సినిమా ఆడిషన్ కు వెళ్లాను. సెలెక్ట్ కాలేదు. అలా ఆడిషన్స్ రిజెక్ట్ చేసినవాళ్లందరికీ నేను పేరు తెచ్చుకుని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. ఫ్యామిలీ స్టార్ తో రాజు గారే చెక్ పంపారు. ఆయనకు ఈ సినిమాతో బిగ్ హిట్ ఇచ్చాక మేమంతా హ్యాపీ. గీత గోవిందంతో ఈ సినిమాకు పోలిక ఉండదు. గీతగోవిందంతో చూస్తే నటుడిగా నేను, దర్శకుడిగా పరశురామ్ ఎంత పరిణితి సాధించామో చూస్తారు. ఖుషి సినిమా దాకా హీరోగా నేను తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. ముందు హీరోగా నిలబడాలని మాత్రమే ఆలోచించా. ఎప్పుడూ డబ్బుల కోసం చూసుకోలేదు. కానీ కోవిడ్ టైమ్ లో నా స్టాఫ్ జీతాలు, మెయింటనెన్స్ ఇవన్నింటికీ ఇబ్బంది కలిగింది. అప్పటి నుంచి మన మార్కెట్ వ్యాల్యూకు తగినట్లు ఫీజు తీసుకోవాలి అనుకుని ఫిక్స్ అయ్యా. ఈ సినిమాకు నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్ కు ఇస్తా. ఆయన ఒక యూనిక్ రైటర్. గోవర్థన్, ఇందూ క్యారెక్టర్ లకు సూపర్బ్ గా రాశాడు. మీరంతా ఫ్యామిలీ స్టార్ ను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.