సినిమాల నుంచి రాజకీయాల వరకు.. విజయ్‌కాంత్ ప్రస్థానమిదే...
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్‌కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్ స్వామి. 1952 ఆగస్టు 25న మధురైలో విజయ్ కాంత్ జన్మించారు.
ఇనిక్కుం ఇలామై(1979) అనే సినిమాతో విజయ్‌కాంత్ నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆయనుకు 27 ఏండ్లు. సుమారు 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్నో ఏళ్లపాటు సినీ అభిమానులను అలరించారు. దాదాపు 20కు పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు నిరాశపరిచినా ఆ తర్వాత విజయాలు అందుకున్నారు. నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో విజయ్ కాంత్ స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత నుంచి అందరూ ఆయన్ను కెప్టెన్‌గా పిలిచారు. మూడు షిఫ్టుల్లో పనిచేసిన హీరోగా విజయ్ కాంత్ కు ఇండస్ట్రీలో పేరుంది.
కొన్నాళ్లకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే(దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు విజయ్ కాంత్. విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇటీవలె విజయ్‌కాంత్ భార్య ప్రేమలత డీఎండీకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు.
విజయకాంత్ చివరి సినిమా మధురవీరన్(2013). ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే.