Gaami Review : విజువల్ వండర్..ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే 'గామి'

Byline :  Shabarish
Update: 2024-03-08 12:11 GMT

టాలీవుడ్‌లో ఓ కుర్ర హీరో అఘోర పాత్ర చేయడం ఏంటని అందరూ అనుకున్నారు. కానీ ఆ పాత్రలో కూడా విశ్వక్ సేన్ అలా ఒదిగిపోయారంతే. నేడు ఆడియన్స్ ముందుకొచ్చిన గామి మూవీ ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పాలి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన గామి మూవీని కార్తీక్ శబరీష్ నిర్మించారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

శంకర్ అనే ఓ అఘోరా (విశ్వక్ సేన్)కు గతం గుర్తుండదు. మనుషుల స్పర్శ తగిలితే ఇక ప్రాణం పోయినట్లే. కొన్నాళ్ల పాటు విశ్వక్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ ఆశ్రమం వాళ్లు కూడా అతని వల్ల చెడు జరుగుతుందని తెలిసి అతన్ని ఆశ్రమం నుంచి పంపిచేస్తారు. దీంతో తనను ఆశ్రమంలో చేర్పించిన కేదారి బాబా కోసం విశ్వక్ కుంభమేళాకు బయల్దేరుతాడు. అయితే అక్కడ బాబా చనిపోయి ఉంటాడు. కానీ విశ్వక్ సేన్ జబ్బును పోగొట్టే మాలిపత్రాల గురించి ఆ బాబా తన శిష్యులకు చెప్పి వెళ్లుంటాడు. దానికి సంబంధించిన మ్యాప్‌ను కూడా ఇచ్చుంటాడు. అదే మాలిపత్రాల కోసం హీరోయిన్ చాందిని కూడా హిమాలయాలకు బయల్దేరుతుంది.

మరో ఊర్లో దుర్గా అనే దేవదాసి (అభినయ), తన కూతురు ఉమా కథ నడుస్తుంటుంది. అభినయకు హెల్త్ బాగోకపోవడంతో ఆమెను దేవదాసిగా తప్పించి ఆమె కూతురు ఉమాను పెట్టాలని ఊరి పెద్దలు అనుకుంటూ ఉంటారు. మరోవైపు హిమాలయాల్లో ఓ చోట కర్మాగారంలో డాక్టర్ భక్షి మనుషులపై, మెదడుపై ప్రయోగాలు చేస్తుంటాడు. వీరందరికీ లింకేంటి? అసలు కథలో మన హీరోకు మాలిపత్రాలు దొరికాయా? దేవదాసి వ్యవస్థ నుంచి ఉమా ఎలా తప్పించుకుంది? అనేవి తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే.

సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం విశ్వక్ సేన్, చాందిని, ఉమాల గురించి చూపిస్తారు. హిమాలయాల్లో మాలిపత్రాల కోసం వెతికే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఉమా తల్లి దుర్గ దేవదాసి కథ, హిమాలయాల్లోని కర్మాగారంలో బంధించిన వ్యక్తి కథలను ఫస్టాఫ్‌లో నడిపిస్తారు. వైవిధ్యభరితంగా సాగే సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ మొత్తం హిమాలయాల్లో చేసే సాహసాలు కనిపిస్తాయి. సీన్స్ అన్నీ ఆసక్తిగా సాగుతాయి. సెకండాఫ్ అయితే నెక్ట్స్ ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్లైమాక్స్‌లో ట్విస్ట్ అదిరిపోతుంది.

మూడు కథలను క్లైమాక్స్‌లో కనెక్ట్ చేయడం అద్భుతంగా ఉంది. సినిమాకు మంచి ఎండింగ్ ఇవ్వడం మరో ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా గామి మూవీ అద్భుతమైన సినిమాగా నిలుస్తుంది. హీరో విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు అనిపిస్తోంది. హిమాలయాల్లో సాగే సాహసాలు ఓ రేంజ్‌లో సాగుతాయి. కొన్ని సీన్స్‌లో హీరోయిన్ రిస్క్ తీసుకుని మరీ నటించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ ప్రాణం పోశాయని చెప్పాలి. కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో సెట్ అయ్యింది. కొత్త కథలు చూడాలనుకునేవారికి గామి మూవీ బాగా నచ్చుతుంది.

చిత్రం: గామి

దర్శకత్వం: విద్యాధర్

నిర్మాత: కార్తీక్ శబరీష్

బ్యానర్: కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్

సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి

మ్యూజిక్: నరేష్ కుమారన్,

Mic Tv రేటింగ్‌: 3/5


Tags:    

Similar News