God Movie Review : గాడ్.. భరించడం కష్టం..

By :  Babu Rao
Update: 2023-10-13 12:58 GMT

కంటెంట్ బావుంటే ఏ భాషా చిత్రమైనా ఆకట్టుకుంటోన్న రోజులివి. ఇక తమిళ్ నుంచి అయితే దాదాపు కాస్త పేరున్న హీరోల సినిమాన్నీ తెలుగులో విడుదలవుతున్నాయి. అలాగే ఈ వారం జయం రవి, నయనతార నటించిన గాడ్ అనే సినిమా విడుదలైంది. తమిళ్ లో ఇరైవన్(అంటే కూడా దేవుడు అనే అర్థం) పేరుతో సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ శుక్రవారం రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ పరంగా ఏ హడావిడీ లేకుండా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :

అర్జున్(జయం రవి) అసిస్టెంట్ కమీషనర్. చాలా అగ్రెసివ్. కోర్ట్ కంటే ముందే తనదైన శైలిలో నేరస్తులకు అనధికారికంగా శిక్షలు విధిస్తుంటాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ ఆండ్రూ(నరైన్) కూడా సేమ్ కేడర్ పోలీస్. వారున్న నగరంలో సడెన్ గా కొందరు అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. వారిని అత్యంత పాశవికంగా చంపేస్తుంటాడు బ్రహ్మ(రాహుల్ బోస్) అనే సైకో. అతన్ని పట్టుకునే బాధ్యత వీరిపై పడుతుంది. తనకు వచ్చిన సమాచారం మేరకు బ్రహ్మ ఆచూకీ తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి వెళతాడు ఆండ్రూ. అక్కడ బ్రహ్మ.. ఆండ్రూ పై దారుణంగా దాడి చేస్తాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్జున్ తో పాటు మిగతా పోలీస్ లు బ్రహ్మను అరెస్ట్ చేస్తారు. ఇటు తీవ్రంగా గాయపడిన ఆండ్రూ హాస్పిటల్ లో చనిపోతాడు. దీంతో స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అర్జున్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. సడెన్ గా బ్రహ్మ తప్పించుకుంటాడు. మళ్లీ హత్యలు మొదలవుతాయి. ఈ సారి అర్జున్ పరిచయస్తులే టార్గెట్ గా హంతకుడు హత్యలు మొదలుపెడతాడు. మళ్లీ అతన్ని పట్టుకునేందుకు తను సొంతంగా ప్రయత్నిస్తోన్న టైమ్ లో అర్జున్ కు బ్రహ్మ విషయంలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటీ..? బ్రహ్మ ఎవరు..? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :

సైకోపాథ్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీటికి ఒక టెంప్లేట్ ఉంటుంది.. ఒక సైకో, వరుస హత్యలు, పోలీస్ లకు సవాల్.. హీరో దాన్ని ఛేదించడం.. ఈ క్రమంలో హంతకులను ఎలా పట్టుకున్నారనే పాయింట్ ను ఆద్యంతంగా ఆసక్తిగా సాగే స్క్రీన్ ప్లే.. ఇవి ఆ టెంప్లేట్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటే తప్ప ఆకట్టుకోలేవు. అయితే ఈ విషయంలో గాడ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. హీరోను అగ్రెసివ్ గా పరిచయం చేసి.. స్నేహితుడు చినిపోగానే అచేతనుడుగా మార్చడంతోనే కథనం గాడి తప్పుతుంది. యూనిఫామ్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది పాత పాయింటే అయినా.. దాన్ని కొత్తగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హంతకుడు ఒక్కడు కాదు.. ఇద్దరు అని చెప్పే ఇంటర్వెల్ బ్యాంగ్ బావున్నా.. తర్వాత మళ్లీ ఫస్ట్ హాఫ్ సీన్సే రిపీట్ అవుతుంటాయి. పైగా హత్య చేసే విధానం మరీ పాశవికంగ ఉంది. ఇది రిపీటెడ్ గా ఉండటం చూసేవారికి చిరాకుగా అనిపిస్తుంది. రెండో హంతకుడిని పట్టుకోవడంలో కూడా పోలీస్ ల మైండ్ గేమ్ కనిపించదు. ఎత్తులు, పై ఎత్తులు కనిపించవు. ఒకడు కనిపించగానే వీడే హంతకుడు అని హీరో డైరెక్ట్ గా చెప్పేయడం చప్పగా ఉంది. అతనే హంతకుడు అయినా.. హీరో ఆ విషయాన్ని కనిపెట్టే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే బావుండేది. కానీ ఎప్పుడో పాత కేస్ లో ఒకసారి అరెస్ట్ చేసిన వాడినే సైకో కిల్లర్ అనడం సిల్లీగా ఉంది. ఇక క్లైమాక్స్ సాగదీత సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంటి సినిమాల్లో ఒకడు సైకోగా ఎందుకు మారాడు అనే పాయింట్ చాలా కీలకం. వాడి నేపథ్యం చెప్పడం అవసరం. ఈ సినిమాలో ఇద్దరు సైకోల విషయంలోనూ అది కనిపించదు. ఇది పెద్ద మైనస్ అయింది. కథనం పరంగా తమిళ్ కు తెలుగుకు మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంది. అంటే తెలుగులో 20 నిమిషాలు ట్రిమ్ చేసి విడుదల చేశారు. అయినా ల్యాగ్ ఉందటే ఇక తమిళ్ లో చూసిన వారి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

ఈ కథలో హీరోయిన్ అవసరం లేదు. అయినా నయనతార వంటి పెద్ద స్టార్ ను తీసుకున్నారు. తనను ప్రాపర్ గా వాడుకోలేదు. ఆవిడ ప్రేమిస్తుంది.. అతను పట్టించుకోడు. దీంతో ఆ పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ ను తలపిస్తుంది. తన వల్ల ల్యాగ్ పెరిగిందే తప్ప ఉపయోగం లేదు. ఇక నటన పరంగా జయం రవి సినిమా అంతా ఒకే మూడ్ ను మెయిన్టేన్ చేస్తూ ఆ పాత్రను బానే క్యారీ చేశాడు. నయన్ కు నటించే అవకాశం రాలేదు. నరైన్, విజయలక్ష్మి పాత్రలు రొటీన్. ఇక విలన్స్ గా నటించిన రాహుల్ బోస్, వినోద్ కిషన్ ది బెస్ట్ ఇచ్చారు. ఇతర పాత్రల్లో చార్లీ, అశిష్ విద్యార్థి, భగవతి పెరుమాల్ పాత్రలూ, నటన రొటీన్.

టెక్నికల్ గా కూడా గొప్పగా అనిపించదీ సినిమా. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం అక్కడక్కడా హై గా అనిపించినా.. మళ్లీ డల్ అవుతుంది. పాటలు అస్సలు బాలేదు. ఎడిటింగ్ పరంగా చాలా జంపింగ్ కట్స్ ఉన్నాయి. తెలుగు మాటలు, డబ్బింగా కృతకంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

జయం రవి

ఇంటర్వెల్ బ్యాంగ్

విలన్స్ నటన

మైనస్ పాయింట్స్ :

కథ

కథనం

సంగీతం,

హీరోయిన్ పాత్ర

మితిమీరిన హింసాత్మక దృశ్యాలు

ఫైనల్ గా : గాడ్.. భరించడం కష్టం..

రేటింగ్ : 2/5

- కామళ్ల బాబురావు.


Tags:    

Similar News