ఏ సినిమాల విషయంలో అయినా రిలీజ్ కు ముందు వరకూ ఎవరు గెలుస్తారు అనే పోటీ ఉంటుంది. ఆయా హీరోలు, దర్శకుల రేంజ్ ను బట్టి ఈ లెక్కలు మారుతుంటాయి. కానీ ఫస్ట్ టైమ్ తెలుగుతో ఒక టాప్ స్టార్ తో స్మాల్ స్టార్ పోటీ పడ్డాడు. పైగా ఆ స్టార్ హీరో సినిమా మేకర్స్ ఈ స్మాల్ హీరో సినిమాను ఇబ్బంది పెట్టాలని చూశారు అనే వార్తలు ఓ రేంజ్ లో వచ్చాయి. ఆ వార్తలు ఒక వ్యక్తి కేంద్రంగా ఉండటం.. తర్వాత అతను వాటిని ఖండించడం అంతా చూశాం. ఈ క్రమంలో చిన్న సినిమాకు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పెద్ద సినిమాకు ఎక్కువ థియేటర్స్ వచ్చాయి. మరి ఆ రెండు సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.. యస్.. గుంటూరు కారం, హను మాన్. మరి ఈ ఇద్దరిలో బాక్సాఫీస్ విన్నర్ గా ఎవరు నిలిచారు అనేది చూద్దాం..
మహేష్, త్రివిక్రమ్ సినిమా అనగానే మంచి క్రేజ్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా ఆశించినంత పెద్ద విజయాలు కాదు. అయినా ఇప్పుడు వీరి రేంజ్ లు మారాయి కాబట్టి ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తారు అని భావించారు. బట్ గుంటూరు కారంకు కంటెంటే మైనస్ అయింది. మహేష్ తన వంతుగా అదరగొట్టినా త్రివిక్రమ్ తేలిపోయాడు. దీంతో అభిమానులు కూడా పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. శ్రీ లీలతో ట్రాక్ కూడా తేలిపోయింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ ను నమ్ముకున్నా.. అది ఎమోషనల్ గా వర్కవుట్ కాలేదు. ఆ రెండు పాత్రల మధ్య ఉండే సంఘర్షణ ప్రేక్షకుల వరకూ వెళ్లలేదు. దీంతో వీరి క్యారెక్టర్స్ మధ్య ఉన్న దూరమే.. సినిమాకు ప్రేక్షకులకూ మధ్య కనిపించింది. అందుకే మహేష్ బాబు ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం అని నమ్మకంగా చెప్పాడు కానీ.. సినిమా చూసిన తర్వాత అతని నమ్మకం నిజమవుతుందా అంటే చెప్పడం కష్టమే.
ఇక మహేష్ తో పాటు వచ్చిన చిన్న సినిమా హను మాన్ మాత్రం ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా పాతదే అయినా కొత్తగా ప్రజెంట్ చేయడం వల్ల పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూ నచ్చే అవకాశాలున్నాయి. మన పురాణ సూపర్ హీరో హనుమంతుడి క్యారెక్టర్ బ్యాక్ బోన్ గా ఓ సామాన్య కుర్రాడు సాగించిన పోరాటం నేపథ్యంతో పాటు ఓ పెద్ద సినీ వర్స్ ను క్రియేట్ చేయబోతోన్న వైనాన్ని క్రియేటివ్ గా చెప్పాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజా సజ్జా రేంజ్ కు తగ్గట్టుగా ఉంటూనే హనుమంతుడి ఆశయం కోసం అతన్ని ఓ సమిథలా మలచిన విధానం మాగ్జిమం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో థియేటర్స్ గొడవ, దేవుడి సినిమా, మరో పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఈ గొడవలన్నీ మనకు అనవసరం. కానీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, రేంజ్ పరంగా చూసుకుంటే గుంటూరు కారంపై హను మాన్ అప్పర్ హ్యాండ్ సాధించాడు అని చెప్పొచ్చు. కాకపోతే ముందే చెప్పుకున్నట్టు స్టార్ హీరో, డైరెక్టర్ కాబట్టి కలెక్షన్స్ గుంటూరు కారంకు కలెక్షన్స్ ఎక్కువగా రావొచ్చేమో. కానీ ఈ రెండు సినిమాల మధ్య విజేత మాత్రం హను మాన్ అనే చెప్పాలి.