సీక్రెట్‌గా హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్

Byline :  Shabarish
Update: 2024-03-27 07:43 GMT

'బొమ్మరిల్లు' మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్. తాజాగా సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఈ జంట వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వివాహం చేసుకుంది. సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అతి కొద్ది మంది ముందు అదితిరావు మెడలో సిద్ధార్థ్ మూడుముళ్లు వేశాడు. అయితే దీనిపై ఎటువంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.

వనపర్తి సంస్థాధీశుల వారసుల్లో అదితిరావు హైదరి కూడా ఒకరు. ఆ మధ్య 'మహా సముద్రం' మూవీలో సిద్ధార్థ్‌తో ఆమె నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే పెళ్లిపై వీరు అప్పట్లో ఏ క్లారిటీ ఇవ్వలేదు. కానీ పలు చోట్ల ఈ జంట కనిపించేది. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేవి. దీంతో వీరి పెళ్లి ఖాయమని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే తాజాగా శ్రీరంగపురం రంగనాథ స్వామి ఆలయం మండపంలో వీరి పెళ్లి జరిగింది.

సిద్ధార్థ్, అదితిరావు హైదరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో ఈ బ్యూటీ సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. 2012లో మిశ్రాకు ఆమె విడాకులిచ్చింది. ఇక సిద్దార్థ్ విషయానికొస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన మేఘనను పెళ్లాడాడు. 2007లో ఆమెకు విడాకులిచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితిరావు పెళ్లితో కొత్త జీవితంలో అడుగుపెట్టారు. ఈ జంట కలకాలం కలిసి ఉండాలని పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags:    

Similar News