ఢిల్లీ బ్యూటీ సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్నూ తెలుగులో నటించిన సినిమాలు వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. ఝుమ్మంది నాదం సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఆ తరువాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేదు. ఇక్కడ పెద్దగా హిట్లు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ చిన్నది అక్కడ వరుస ఆఫర్లతో సినీ కెరీర్లో దూసుకెళ్తుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. ఈ రోజు తాప్సీ బర్త్ డే .ఈ సందర్భంగా నటి గతంలో టాలీవుడ్ పై చేసిన విమర్శలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో తాప్సీ తన సినిమా ఫ్లాపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన సినిమాల పరాజయం కారణంగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. తాను యాక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోవడంతో అంతా తనను అన్ లక్కీ అని నిందించారని తెలిపింది.
‘‘నేను తెలుగులో నటించిన అన్ని సినిమాలు వరుసగా డిజస్టర్ అయ్యాయి. అయితే అందరూ నన్ను విమర్శించారు. అన్ లక్కీ అంటూ ఐరన్ లెగ్ అంటూ నిందించారు. వాస్తవానికి నాది సినీ బ్యాక్ గ్రౌండ్ కాదు. సినిమాల గురించి ఎలాంటి అవగాహన లేదు. ఏ మూవీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. నేను చేసిన తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాను. నాకు తెలియక అడుగుతాను సినిమా హిట్ కాకపోతే కథానాయికలను ఎందుకు నిందిస్తారు? సినిమా మొత్తం హీరోయిన్ ఉండదు. కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. లేదా పాటల్లో మాత్రమే హీరోయిన్ ను చూపిస్తారు. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లనే ఎందుకు కారణంగా చూపిస్తారు. అలా నిందించడం తప్పు. నా విషయంలోనూ ఇదే జరిగింది. అన్ లక్కీ అంటుంటే మొదట్లో చాలా బాధ కలిగేది. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు బాలీవుడ్లో నాకు వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకుంటాను’’ అని తాప్సీ తెలిపింది.