త్వరలో థియేటర్లలోకి రానున్న దేశభక్తి సినిమాలివే

Update: 2023-08-15 03:48 GMT

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. ఎంతోమంది అమరవీరుల పుణ్యఫలమే ఈ స్వాతంత్ర్యం. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎంతో మంది యోధులు తమ ప్రాణాలను అర్పించుకున్నారు. అలాంటి వీరుల త్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మరువరు. అమరవీరుల జీవితాలకు చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో బ్రహ్మరథం పడుతూనే ఉంది. వారి చరిత్రలను తెరపై చూపిస్తూ.. ప్రేక్షకుల్లో స్పూర్తిని నింపుతోంది. అప్పటి మదర్​ ఇండియా నుంచి ఇప్పటి మేజర్​ దాక అటు బాలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లోనూ ఎన్నో సినిమాలు.. సినీ అభిమానుల్లో దేశభక్తిని నింపాయి. 'లగాన్‌', 'బోర్డర్‌', 'మంగళ్‌పాండే', 'రంగ్‌ దే బసంతీ', 'షేర్షా', 'ఎల్‌వోసీ', 'గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా', 'ఎయిర్‌లిఫ్ట్‌', 'ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌', 'లక్ష్య', 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌', 'రాజీ' లాంటి చిత్రాలు భారీ విజయాలు మూటగట్టుకున్నాయి. దేశభక్తిపై త్వరలో మరికొన్ని సినిమాలు రానున్నాయి. అవేంటంటే..

'ఉరి..ది సర్జికల్ స్టైక్' తర్వాత 'శ్యామ్‌ బహదూర్‌'..

Full View

సాహసోపేత భారత సైనికుడు, త్రివిధ దళాల అధిపతి శ్యామ్‌ బహదూర్‌ మానెక్‌షా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 'శామ్​ బహదూర్‌'. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాన్ని గెలిపించిన వ్యూహకర్త, బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి అద్యుడైన మానెక్‌షా పాత్రను బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్‌ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్‌, మనోజ్‌ బాజ్‌పేయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారత్‌ - పాక్‌ పోరాటం 'పిప్పా'..

Full View

'ధడక్'​ ఫేం హీరో ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'పిప్పా'. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో శత్రువులను మట్టి కరిపించేందుకు పోరాడిన బ్రిగేడియర్‌ బల్‌రామ్‌ సింగ్‌ మెహతా స్వానుభవాల సమాహారమే ఈ సినిమా. 'ఎయిర్‌లిఫ్ట్‌' ఫేం రాజా కృష్ణమీనన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ , రోనీ స్క్రూవాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబరు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

'యోధ'గా వస్తున్న సిద్ధార్థ్

Full View

'షేర్షా' లాంటి దేశ భక్తి సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్‌ మల్హోత్రా లీడ్​ రోల్​లో మరో దేశ భక్తి సినిమా రూపొందుతోంది.'యోధ' అనే టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకద్వయం సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓఝా తెరకెక్కిస్తున్నారు. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, శశాంక్‌ ఖైతాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటానీ, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అజయ్‌ దేవగణ్‌ 'మైదాన్‌'

Full View

ఫుట్‌బాల్‌లో అట్టడుగున ఉన్న భారత జట్టును మేటిగా మలచి మన సత్తా ఏంటో చూపించారు కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం. ఆయన జట్టును ఈ స్థాయికి చేర్చేందుకు తన జీవితాన్నే త్యాగం చేశారు. ఇక ఆయన బయోపిక్‌గా 'మైదాన్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌, గజ్‌రాజ్‌రావు, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా రిలీజ్​ డేట్​ వాయిదా పడటం వల్ల.. దీని విడుదల తేదీ ఇంకా స్పష్టంగా తెలియదు.

క్విట్​ ఇండియా.. ఆ యువతి గాథ..

Full View

స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రభావితురాలైన ఓ యువతి తన జీవితాన్ని ఎలా దేశానికి అంకితం చేసిందనే కథాంశంలో రూపొందుతున్న సినిమా 'ఏ వతన్‌ మేరే వతన్‌'. సారా అలీఖాన్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 30న ఈ సినిమా విడుదలవ్వనుంది.



 


Tags:    

Similar News