Waheeda Rehman : ఫాల్కే అవార్డు విజేత వహీదాకు తెలుగువారితో బలమైన బంధం
హేమమాలిని, శ్రీదేవి, జయప్రద వంటి తారలకున్నా చాలా ముందే దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన ఎందరో నటీమణులు బాలీవుడ్‌లో జెండాను బలంగా పాతారు. వైజయంతిమాల, (Waheeda Rehman Telugu Movie )వహీదా రెహమాన్, పద్మిని తదితరులు అందచందాలతో, నటనతో ఉత్తరాది ప్రేక్షుకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తాజాగా మనదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సినీ పురస్కారం దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన వహీదా రెహమాన్ తొలిరోజుల్లో తెలుగు, తమిళ చిత్రాలతో అదృష్టం పరీక్షించుకున్నవారే. ఆమె ప్రతిభాపాటవాలను గుర్తించిన బాలీవుడ్ కెరీర్ తొలిదశలోనే ముంబైకి ఆహ్వానించడంతో తర్వాత దక్షిణాది చిత్రాలకు దూరమయ్యారు. అయితే అడపాదడపా తెలుగుతోపాటు కొన్ని దక్షిణాది మూవీల్లో కనిపించారు.
తొలి చిత్రమే తెలుగులో..
వహీదా హైదరాబాద్‌లో పుట్టారని ప్రచారంలో ఉంది. అయితే ఆమె తమిళనాడులోని చెంగల్పట్టు జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా కొన్నేళ్లు విశాఖపట్నంలో ఉన్నారు. అందుకే ఆమె తెలుగులో కాస్త మాట్లాడతారు. ఆమె తొలి భరతనాట్య ప్రదర్శన కూడా తెలుగువారు అధికంగా ఉన్న గంజాంలో బరంపురంలోనే జరిగింది. ‘ఆలిబాబాబావుమ్ 40 తిరుదర్గాలము’ అనే తమిళ చిత్రంలో నర్తకిగా తెరంగ్రేట్రం చేశారు వహీదా. ఆ చిత్రానికింటే ముందు ఆమె నర్తించిన ‘ఏరువాకా సాగరో’ పాట ఉన్న తెలుగు మూవీ ‘రోజులు మారాయి’ (1955) విడుదలైంది. మంచి బీట్‌తో కొనసాగే ఈ పాట వహీదాకు చాలా పేరు తెచ్చింది. అదే సంవత్సరం విడుదలైన ఎన్టీఆర్ ‘జయసింహ’లోనూ ఆమె కనిపించారు. 1956లో గురుదత్ ‘సీఐడీ’ చిత్రంలో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. ఆనాటి టాప్ హీరోలందరి సరసనా నటించిన వహీదా కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా సమాంతర చిత్రాల్లోనూ నటించారు. సత్యజిత్ రే బెంగాలీ చిత్రం ‘అభిజాన్’(1962)లో సత్తా చాటారు.
పద్మావతిగా..
హిందీ ఎంతో బిజీగా ఉన్నా మధ్యమధ్యలో దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ‘త్రిసంధ్య’(మళయాళం)లో కీలక పాత్ర పోషించారు. 1972లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ‘బంగారు కలలు’ చిత్రంలో సరోజ పాత్రలో మెరిశారు. ‘సింగారం చిందులు వేసే అమ్మయిల్లారా బంగారు కలలే కంటున్నారా’ పాటలో చక్కని నాట్యం చేశారు. బర్త్ డే హిట్ సాంగ్ ‘పుట్టిన రోజు జేజేలు చిట్టిపాయి’ అని పాడారు. సూపర్ స్టార్ కృష్ణ హీరో హిట్ మూవీ ‘సింహాసనం’ లో రాజమాత కనిపించారు. 2006లో వచ్చిన సిద్ధార్థ్ మూవీ ‘చుక్కల్లో చంద్రుడు’లో మళ్లీ అక్కినేని సరసనే పద్మావతిగా నటించారు. తెలుగులో ప్రస్తుతానికి అదే ఆమె చివరి చిత్రం. హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ తదితర భాషాలో చిత్రాల్లో 85 ఏళ్ల వయసులోనూ నటిస్తున్న వహీదా నిండునూరేళ్లూ జీవించి మళ్లీ మన తెలుగుతెరపై కనిపించాని ఆశిద్దాం.