Saripodhaa Sanivaaram: నానీ.. సరిపోదా తెలుగు మార్కెట్

Byline :  Babu Rao
Update: 2024-02-24 11:06 GMT

హీరోలన్నాక ఇమేజ్ లుంటాయి. ఆ ఇమేజ్ లకు తగ్గట్టుగా కథలు ఎంచుకుంటారు. కొందరు మాత్రం ఫిజిక్ సహకరించకున్నా.. కటౌట్ సూట్ కాకున్నా కొత్త కథలు ట్రై చేస్తుంటారు. టాలీవుడ్ నుంచి ఆ లిస్ట్ లో చేరాడు నేచురల్ స్టార్ నాని. నానిని చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. కానీ అతను మాత్రం ఈ మధ్య మాస్ మంత్రం జపిస్తున్నాడు. యాక్షన్ సినిమాలు చేస్తా అంటూ ఆ కథలే ఎంచుకుంటున్నాడు. బట్ వాటి రియాక్షన్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా కనిపించడం లేదు. అయినా మాస్ హీరో అయిపోవాలనే ప్రయత్నాలు ఆపడం లేదు. పైగా ఈ మధ్య తనకు ఏ మాత్రం సెట్ కాని ప్యాన్ ఇండియన్ మార్కెట్ వెంట పడుతున్నాడు. అయినా నానీ.. నీ కటౌట్ కు భారీ ఫైట్లు చేస్తే జనం చూస్తారా..? పర్సనాలిటీలో పస లేదు.. వాయిస్ లో బేస్ లేదు.. అయినా మనకెందుకీ ప్యాన్ ఇండియన్ యాక్షన్ మూవీస్ అని సన్నిహితులు చెబుతూనే ఉన్నారట. అయినా ఆపితేనా.. ఇదుగో ఇప్పుడు సరిపోదా శనివారం అంటున్నాడు.

కొందరు హీరోలను చూడగానే ఫలానా కథలకే అని ఊహించుకుంటారు ప్రేక్షకులు. వారి ఊహలను దాటి ఏ కొందరో కానీ సక్సెస్ కారు.నానిని చూసినా ఫ్యామిలీ ఆడియన్స్ కు సరిపోయే సినిమాలకే పరిమితం అనిపిస్తాడు. తనూ ఇన్నాళ్లూ అదే చేశాడు. బట్ కొన్నాళ్లుగా రూట్ మార్చాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ నుంచి మాస్ మంత్రం జపిస్తున్నాడు. ఆ సినిమాలో ఒక ఫైట్ లో తనకంటే పెద్ద ఆజానుబాహుడైన విలన్ కొడుతుంటే జనం నవ్వుకున్నారు తప్ప.. ఆ ఎమోషన్ ను ఫీల్ కాలేకపోయారు. నిజానికి అది చాలా పెద్ద ఇంటెన్సిటీ ఉన్న సీన్. బట్ కేవలం నాని యాక్షన్ చేయడం వల్లే తేలిపోయిందనేవారూ ఉన్నారు. తర్వాత దసరా సినిమాలో ఒళ్లంతా నల్ల రంగు పూసుకుని ఇదే మాస్ అనుకోండి అన్నారు.

అతని గెటప్ సంగతేమో కానీ.. తాగిన మందు సీసాల లెక్క చూసి ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు. పైగా ఇందులో మనోడికంటే మరో హీరో కథే ఎక్కువమందిని ఆకట్టుకుంది. చివర్లో చేసిన ఫైట్ కూడా అంతే. నానికి పెద్దగా సూట్ కాలేదు. ఇక ఈ దసరాతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనుకుంటే తెలుగోళ్లకే పెద్దగా కనెక్ట్ కాని సినిమా దేశానికేం నచ్చుతుంది. అయినా నాని లాంటి హీరోలు ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి వెళ్లడం తప్పేం కాదు. కానీ కటౌట్, కంటెంట్ రెండూ ఉండాలి కదా. ఆ రెండిటిలో మనోడికి కటౌట్ ఎలాగూ లేదు. మరి కంటెంట్ సంగతేమో కానీ ఇప్పుడు మరోసారి ప్యాన్ ఇండియన్ సినిమా అంటున్నాడు. అదే సరిపోదా శనివారం. ఈ టైటిలే విచిత్రంగా ఉంది అనుకుంటే దానికి జస్టిఫికేషన్ అంటూ వచ్చిన గ్లింప్స్ చూస్తే ఇంకా చిత్రంగా ఉంది.

ఈ సినిమాలో నాని పాత్ర పేరు సూర్య. సూర్యకు కోపం వచ్చినా.. తనకు శతృవులు ఉన్నా.. కేవలం ఒక్క శనివారం మాత్రమే పగ తీర్చుకుంటాడాట. మరి మిగతా రోజుల్లో అతగాడు ఏం చేస్తాడో కానీ ఈ శనివారం పగ తీర్చుకోవడం అనే మాట వింటే మాత్రం మంగళవారం సామెత గుర్తుకు రాక మానదు. ఇక ఈ గ్లింప్స్ ను కూడా అన్ని భాషల్లో విడుదల చేశారు. తమిళ్ దర్శక నటుడు సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అతని వాయిస్ లోనే వినిపించిన డైలాగ్స్ చూస్తే.. ‘‘ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా ఒక రోజు మాత్రమే వాడే పిచ్చి నా కొడుకును ఎవరైనా చూశారా..’’ అని ఉంది. అంటే వారం అంతా దాచుకున్న కోపాన్ని శనివారం చూపిస్తాడన్నమాట. మరి ఈ శనివారం గోల ఏంటో కానీ.. నానికి తెలుగు మార్కెట్ సరిపోదా అని మాత్రం చాలామంది సెటైర్స్ వేస్తున్నారు. ఆ సెటైర్స్ కు సమాధానం చెప్పాలంటే ఈ సినిమా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ అనిపించుకోవాలి. అప్పుడే లెక్క సరిపోతుంది. 

Tags:    

Similar News