Vinayakan : ‘జైలర్’ విలన్ అరెస్ట్.. రియల్ లైఫ్‌లోనూ విలన్ పని చేసి..
రజనీకాంత్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘జైలర్’లో ‘వర్త్ వర్మా వర్త్’’ డైలాగ్‌తో విలనిజాన్ని అద్భుతంగా పండించిన నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిజ జీవితంతో విలన్‌లా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురిచేయడంతో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి అరెస్ట్ చేశారు. వినాయకన్ ఎర్నాకుళంలోని తను నివసిస్తున్న అపార్ట్‌మెంట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పీకల దాకా మందుకొచ్చి అల్లరి చేశాడు. ప్రజలను బండబూతులు తిడుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. స్థానికులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎర్నాకుళం నార్త్ పోలీసులు అతని అరెస్ట్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. వినాయకన్ రియల్ లైఫ్‌లోనూ విలన్‌గానే ప్రవర్తిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన వినాయకన్ తర్వాత నటనవైపు మళ్లాడు. మలయాళంలో పేరొచ్చాక కోలీవుడ్, టాలీవుడ్‌లలోకి వచ్చేశాడు. కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో కనిపించాడు. ‘కమ్మటిపాదం’ అనే మలయాళ మూవీలో నటనకు గాను రాష్ట్ర ఉత్తమ నటుడి పురస్కారం కూడా పొందాడు. కొన్ని సినిమాలకు సంగీతం అందించడంతోపాటు స్వయంగా పాడాడు కూడా.