వాల్తేర్ వీరయ్య హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న మరో మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ అగస్ట్ 11న రిలీజ్ కానుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైనా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది.
జాం జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క అనే సెలబ్రేషనల్ సాంగ్ను మూవీ యూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీలు తమ వాయిస్ తో అదరగొట్టారు. ముఖ్యంగా పాట మధ్యలో మంగ్లీ నర్సపెల్లి గండిలోన గంగధారి అనే ప్రైవేట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ మొత్తం చాలా గ్రాండియర్‌గా కనిపిస్తుంది.
ఈ సాంగ్కు చిరంజీవి, సుశాంత్, కీర్తి సురేష్, తమన్నా స్టెప్పులేశారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తమిళ వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని ఇటీవలె చిరంజీవి తెలిపారు. ‘‘భోళా శంకర్ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందం కలిగించింది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.