Kaun Banega Crorepati : 14ఏళ్ల బాలుడి రికార్డ్.. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో రూ.కోటి గెలుచుకున్న బాలుడు
పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఓ 14 ఏళ్ల బాలుడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌నే తన టాలెంట్‌తో ఫిదా చేశాడు. అంతే కాదు భారతీయుల హృదయాలను దోచేశాడు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోలో అక్షరాలా కోటి రూపాయలను గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేశాడి బుడతడు. జూనియర్స్ స్పెషల్‌లో భాగంగా హరియాణాకు చెందిన 8వ తరగతి చదువుతున్న మయాంక్ ఈ గేమ్‌లో పాల్గొన్నాడు. కేబీసీ లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రశ్నలన్నింటికి కరెక్ట్ సమాధానాలు చెప్పి కోటి క్యాష్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మయాంక్ సోషల్ స్టార్ అయిపోయాడు. వాట్ ఏ టాలెంట్ అంటూ నెటిజన్స్ బాలుడిని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
షో మొదలైనప్పటి నుంచి మయాంక్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. షో మొత్తంలో మయాంక్ ఒక లైఫ్ లైన్ మాత్రమే వాడుకున్నాడు. రూ.3.2లక్షల వరకూ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతూ వచ్చాడు. రూ.12.5లక్షల ప్రశ్నకు మాత్రం ఒక లైఫ్ లైన్ వాడుకున్నాడు. ఇక కోటి రూపాయల ప్రశ్నకు మాత్రం ఆన్సర్ చెప్పి మాయంక్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో షో చూస్తున్న వారు కూడా భావోద్వేగమయ్యారు. ఈ సీన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లోని ఓ సన్నివేశాన్ని తలపించించింది. ఇంతకీ కోటి రూపాయల ప్రశ్న ఏమిటంటే ‘కొత్తగా కొనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి దాని మ్యాప్‌ను రూపొందించిన యూరోపియన్ క్యాట్రోగ్రాఫర్ ఎవరు?’ అని అమితాబ్ ప్రశ్న అడిగారు. అందుకు నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. A.అబ్రహాం ఓర్టెలియస్, B.గెరాడస్ మెరేక్టర్, C.జియోవన్నీ బాటిస్టా అగ్నెస్, D.మార్టిన్‌వాల్డీ ముల్లర్ అంటూ నాలుగు ఆప్షన్స్ చెప్పడంతో మయాంక్..మార్టిన్ వాల్డీముల్లర్ అని సమాధానం చెప్పి అందరినీ అవాక్కు చేశాడు. కోటి రూపాయలను సొంతం చేసుకుని తొలి జూనియర్ ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత రూ.7 కోట్ల ప్రశ్నకు ప్రయత్నించి షో నుంచి వెళ్లిపోయాడు. మయాంక్ ఇంతటి విజయం సాధించడంతో ఏకంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ జీనియస్ అంటూ అభినందనలు తెలిపారు. కేబీసీలో అవకాశం రావడం ఎంతో అదృష్టమని మయాంక్ తెలిపాడు, అమితాబ్ సర్ ఎదురుగా కూర్చొని గేమ్ ఆడటం చాలా ఆనందంగా ఉందని మాయంక్ చెప్పుకొచ్చాడు. తనని ప్రోత్సహించిన పేరెంట్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు