నేటీ రాజకీయాలపై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సెటైర్లు వేశాడు. చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో టెన్త్, ఇంటర్ టాపర్స్ను విజయ్ సన్మానించారు. అవార్డుతో పాటు నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమన్నారు. అసమర్థులు పాలకులు అవుతున్నారంటే అందుకు కారణం ప్రజలేనని.. డబ్బు తీసుకుని ఓటేస్తే ఇలాగే ఉంటుందని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి చూస్తుంటే మన కన్నును మన వేలితో మనమే గుచ్చుకున్నట్లుగా ఉందని విమర్శించారు.
‘‘మీరే కాబోయే ఓటర్లు. రానున్న కాలంలో నాయకులను ఎన్నుకోవాల్సిందీ మీరే. ప్రస్తుతం డబ్బు ఇచ్చిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఒక వ్యక్తి ఓటు కోసం అధిక మొత్తంలో డబ్బు ఇస్తున్నాడంటే.. గతంలో అతడు ఎంత డబ్బు సంపాదించాడో అర్థం చేసుకోండి. కాబట్టి, డబ్బు తీసుకుని ఓటు వేయొద్దని విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు చెప్పాలి. అలా జరిగితే అందరికీ ఉన్నత విద్య లభిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ పాఠం రూపంలో చెప్పాలని కోరుకుంటున్నా’’ అని విజయ్ అన్నారు.
ప్రస్తుత యుగంలో సోషల్‌మీడియా వేదికగా కొంతమంది ఫేక్‌న్యూస్‌లు సృష్టిస్తారని..వాటి వెనుక కొన్ని అజెండాలు ఉంటాయని విజయ్ చెప్పారు. వాటిని అర్థం చేసుకోవడం కోసం అంబేద్కర్, పెరియార్ వంటి గొప్ప నాయకుల పుస్తకాలు చదవాలని సూచించారు. ‘‘నేను పుస్తకప్రియుడ్ని కాదు. కానీ ఈ మధ్య పుస్తకాలు బాగా చదువుతున్నాను. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి సమాజంలోని కొందరు వ్యక్తులు ఎప్పుడూ మీ పక్కనే ఉంటారు. వారిని పట్టించుకోవద్దు’’ అని అన్నారు.