Lokesh Kanagaraj :"గోవిందా.. గోవిందా.." కాలినడకన తిరుమల కొండకు 'లియో' టీమ్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-12 03:22 GMT

ప్రస్తుతం సౌత్ ఇండియన్ డైరెక్టర్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్నవారిలో లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన తమిళ అవైటెడ్ మూవీ “లియో”(Leo) కోసం సినీ అభిమానులంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. దసరా (Dussehra 2023) పండగను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ రాబోతోంది. 250 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్, రైటర్ రత్నకుమార్, సినిమా యూనిట్ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన టీమ్ అంతా కలసి తిరుమల చేరుకున్నారు. నిన్న రాత్రి తన టీమ్‌తో కలిసి లోకేష్ ఏడుకొండలు ఎక్కుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ టీమ్‌లోని సభ్యులంతా తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన చేతికర్రలతో మెట్లెక్కుతున్నారు. టీటీడీ భద్రతా సిబ్బంది సైతం వీళ్లను రక్షణ కల్పించారు. ‘లియో’ సినిమా విడుదలకు ముందు ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోవడానికి లోకేష్ తిరుమల వెళ్లారు. 




 


తిరుపతి అలిపిరి మెట్ల మార్గం గుండా చేతి కర్రలను చేతబట్టుకుని గోవింద నామ స్మరణ చేస్తూ తిరుమల మెట్లెక్కారు. మార్గ మధ్యలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల చేరుకున్న ఫోటోలను లియో రైటర్ రత్నకమార్ ట్విటర్ లో షేర్ చేశారు.




 


ఈ సినిమా విషయానికొస్తే... విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా 'లియో'. గతంలో వీరి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా రాగా.. ప్రస్తుతం ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా తమిళ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్‌ను విపరీతంగా పెంచింది.




 


ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, శాండీ మాస్టర్, బాబు ఆంటోని, మనోబాల తదితరులు ఈ సినిమాలో నటించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను నిర్మించారు.




Tags:    

Similar News